
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో హై అలెర్ట్ ప్రకటించారు. ఉగ్రవాదులు ముప్పు పొంచి ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో తిరుమలలో భద్రత కట్టుదిట్టం చేశారు. అలిపిరి తనిఖీ కేంద్రంతో పాటు ఘాట్‌లోని పలుచోట్ల ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలతో పాటు లగేజీని స్థానిక పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు తిరుమలలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ప్రత్యేక బృందాలతో గట్టి నిఘా ఏర్పాటు చేశారు,
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు నరమేధానికి పాల్పడ్డారు. మినీ స్విట్జర్లాండ్‌గా భావించే పహల్గామ్‌లోని పర్యాటక అందాలను తిలకిస్తున్న పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. మరోవైపు, దేశంలో మరోమారు ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.