Tirumala: తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం పెరుగుతూనే ఉంది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో దాదాపు 670 కోట్లు వసూలు చేస్తే కేవలం జూలై నెలలో 125 కోట్లు జమైంది...
కలియుగ ప్రత్యక్షదైవం అయిన శ్రీ వేంకటేశ్వరుడి హుండీ కళకళలాడిపోతోంది. నెల నెలకూ స్వామివారికి హుండీ ఆదాయం, వచ్చే కానుకలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ఏడు నెలల్లో మొదటి ఆరునెలలు కన్నా ఏడో నెలలో హుండీ ఆదాయం భారీగా పెరిగింది. భక్తుల సంఖ్యకు తగ్గుట్టుగానే హుండీ ఆదాయం అంతకంతకూ రికార్డులు క్రియేట్ చేస్తోంది. జనవరి నుంచి స్వామివారి హుండీ ఆదాయం పరిశీలిస్తే..
- జనవరిలో రూ.116.46 కోట్లు
- ఫిబ్రవరిలో రూ. 111.71 కోట్లు
- మార్చిలో రూ. 118.49 కోట్లు
- ఏప్రిల్ లో రూ.101.63 కోట్లు
- మే నెలలో రూ.108.28 కోట్లు
- జూన్ నెలలో రూ.113.64 కోట్లు
- జూలైలో రూ.125.35 కోట్లు
జనవరిలో 116 కోట్లు కాగా..ఫిబ్రవరిలో కొంత తగ్గింది..మళ్లీ మార్చిలో హుండీ ఆదాయం జనవరి కన్నా పెరిగింది. మార్చితో పోల్చుకుంటే ఏప్రిల్, మే నెలల్లో వరుసగా తగ్గినా జూన్ లో పెరిగింది...జూలైలో అంతకుమించి నమోదు చేసింది. జూలైలో దాదాపు 22.13 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. కోటి 4 లక్షల లడ్డూలు విక్రయించినట్టు టీటీడీ పేర్కొంది. ఇక 24.04 లక్షల మంది అన్నప్రసాదం స్వీకరించారని టీటీడీ అదికారులు వెల్లడించారు.