తిరుమల లడ్డూ చుట్టూ లొల్లి.. అయినా తగ్గని డిమాండ్.. 21వ తేదీ ఒక్కరోజే..

తిరుమల: లడ్డూ చుట్టూ వివాదాలతో లడ్డూ విక్రయాలు తగ్గుతాయని భావించినప్పటికీ తిరుమల లడ్డూకు డిమాండ్ భారీగా పెరిగింది. ఈ వివాదం తర్వాత లడ్డూ విక్రయాలు భారీగా పెరిగాయి. లడ్డూ విక్రయాలపై నెయ్యి కల్తీ వివాదం ప్రభావం చూపకపోవడం గమనార్హం. లడ్డూ తయారీలో తప్పిదాలు జరిగినట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ శ్రీవారి లడ్డూను భక్తులు పరమ పవిత్రంగానే భావిస్తున్నారు. 

సెప్టెంబర్ 19న 3.59 లక్షలు, 20న 3.16 లక్షలు, 21న 3.66 లక్షల లడ్డూలను శ్రీవారి భక్తులు కొనుగోలు చేసినట్లుగా తెలిసింది. పెరటాసి ( తిరుమల శనివారాలు) మాసం సెప్టెంబర్ 18న ప్రారంభం కావడంతో గత నాలుగు రోజులుగా తమిళనాడు నుంచి భారీగా భక్తులు శ్రీవారి దర్శనానికి తరలివస్తున్నారు. తెలుగు వారికి శ్రావణ మాసం, కార్తీక మాసంలానే తమిళనాడు వాసులకు పెరటాసి మాసం ఎంతో ప్రముఖమైంది.

సీఎం చంద్రబాబు వ్యాఖ్యలతో తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి ప్రసాదమైన లడ్డూ తయారీ.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. గత వైసీపీ ప్రభుత్వం లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వాడిందన్న వివాదంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నెయ్యిలో గొడ్డు కొవ్వు, ఫిష్ ఆయిల్ అవశేషాలు ఉన్నట్లు గుజరాత్‌‌‌‌కు చెందిన నేషనల్‌‌‌‌ డెయిరీ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ బోర్డు (ఎన్‌‌‌‌డీడీబీ) కాఫ్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌ తన రిపోర్టులో అనుమానం వ్యక్తం చేసింది. దీనిపై కేంద్రం స్పందించి.. ఏపీ ప్రభుత్వం నుంచి నివేదిక కోరింది. అత్యంత పవిత్రమైన తిరుమలలో జరిగిన ఈ అపచారంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Also Read:- టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు

లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిపిన కల్తీ నెయ్యి వాడుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు రాజకీయంగా మరింత అగ్గి రాజేశాయి. లడ్డూ తయారీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. లడ్డూ వివాదంపై టీటీడీ ఈవో శ్యామల రావు కూడా స్పందించారు. లడ్డూల తయారీలో ఉపయోగించిన నెయ్యిలో నాణ్యత లేదని, భారీగా కల్తీ జరిగినట్టు ల్యాబ్‌‌‌‌ టెస్ట్లో స్పష్టమైందన్నారు.