వక్ఫ్ బోర్డ్‎పై సుప్రీంకోర్టు విచారణలో.. కీలకంగా మారిన తిరుమల ప్రస్తావన..!

వక్ఫ్ బోర్డ్‎పై సుప్రీంకోర్టు విచారణలో.. కీలకంగా మారిన తిరుమల ప్రస్తావన..!

న్యూఢిల్లీ: వివాదస్పద వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టులో వాడీవేడీగా వాదనలు సాగాయి. వక్ఫ్ చట్టాన్ని రద్దు చేయాలని దాఖలైన 73 పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం బుధవారం (ఏప్రిల్ 16) విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కెవి విశ్వనాథన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఇరువర్గాల వాదనలు విన్నది. పిటిషనర్ల తరుఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, కపిల్ సిబల్ వాదించగా.. ప్రభుత్వం తరుఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఆర్గుమెంట్స్ వినిపించారు. 

సవరించిన వక్ఫ్ చట్టంలోని అతిముఖ్యమైన నిబంధన.. ముస్లిమేతరులను వక్ఫ్ బోర్డులో చేర్చడంపై ప్రధానంగా విచారణ జరిగింది. ఈ చర్య ముస్లింలు తమ మతాన్ని ఆచరించే స్వేచ్ఛను దెబ్బతీస్తుందని పిటిషనర్లు వాదించారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు అంశం కూడా చర్చకు వచ్చింది. ఈ అంశంపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేశారు. 

వక్ఫ్ బోర్డులో మాదిరిగా.. ఇకపై టీటీడీ, హిందు ట్రస్ట్ బోర్డుల్లో హిందుయేతరలను చేర్చుకుంటారా అని ప్రశ్నించారు సీజేఐ. ఇప్పటి వరకు తిరుమల తిరుపతి బాలాజీ ఆలయంలో హిందువులు కానివారు ఉన్నారా..? ఉంటే ఒక ఉదాహరణ ఇవ్వాలని జస్టిస్ సంజయ్ కుమార్ కేంద్రాన్ని కోరారు. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను చేర్చాలన్నప్పుడు.. హిందు ట్రస్ట్ బోర్డులో హిందుయేతరులను ఎందుకు నియమించకూడదని ప్రశ్నించింది ధర్మాసనం. అలాగే.. వందల ఏళ్ల నాటి వక్ఫ్ ఆస్తులకు ఇప్పుడు పత్రాలు ఎక్కడి నుంచి వస్తాయని ధర్మాసనం పేర్కొంది. 

►ALSO READ | హిందూ బోర్డులలో ముస్లింలను అంగీకరిస్తారా..? కేంద్రానికి సుప్రీంకోర్టు సూటి ప్రశ్న

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతోన్న ఆందోళనల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం బాధకరం.. హింసాత్మక ఘటనలు తమను తీవ్రంగా బాధించాయని పేర్కొంది. అనంతరం కేంద్ర ప్రభుత్వం, ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. చట్టంపై స్టే విధించాలన్న పిటిషనర్ల అభ్యర్థనను తోసిపుచ్చుతూ.. కేసు తదుపురి విచారణను రేపటకి (2025, ఏప్రిల్ 17) వాయిదా వేసింది.