Tirumala Temple Hundi April Income: తిరుమల శ్రీవారికి ఏప్రిల్ నెలలో కూడా రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. పాత రికార్డును కొననసాగిస్తూ.. ఈసారి కూడా హుండీ ఆదాయం రూ.100 కోట్ల మార్క్‌ను అందుకుంది. అయితే మార్చి నెలతో పోలిస్తే.. ఏప్రిల్ నెలలో ఆదాయం తగ్గింది. ఎన్నికల ప్రభావంతో పాటుగా పరీక్షల కారణంగా ఆదాయం తగ్గిందని భావిస్తున్నారు.
తిరుమల శ్రీవారికి మరోసారి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. ఏప్రిల్ నెలలో కూడా రికార్డు స్థాయిలో భక్తులు కానుకల్ని సమర్పించారు. 2022 మార్చి నెల నుంచి ఈ రికార్డు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ నెలలో తిరుమల శ్రీవారిని 20.17 లక్షలమంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారి హుండీకి కానుకలు రూ.101.63 కోట్లు రాగా.. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 8.08 లక్షలు. ఏప్రిల్ లో విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య 94.22 లక్షలు కాగా.. తిరుమలలో అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య 39.73 లక్షలుగా ఉంది.
2022 మార్చి నెల నుంచి తిరుమల శ్రీవారి ఆదాయం రూ.100 కోట్ల మార్క్‌ను అందుకుంటోంది. అప్పటి నుంచి వరుసగా ప్రతి నెలా రూ.100 కోట్ల ఆదాయం వస్తోంది. కరోనా సమయంలో కొద్ది నెలలు తిరుమల శ్రీవారి ఆదాయం మూతపడింది.. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత కొద్ది రోజులు భక్తుల రద్దీ పెద్దగా కనిపించలేదు. ఆ తర్వాత మెల్లిగా భక్తుల రద్దీ పెరుగుతూ రావడంతో.. హుండీకి కూడా భారీగా ఆదాయం సమకూరుతోంది. ప్రతి నెలా ఏకంగా రూ.100 కోట్ల మార్క్‌ను అందుకుంటోంది.తిరుమల శ్రీవారి ఆదాయం మార్చి నెలతో పోలిస్తే తగ్గింది.. మార్చి నెలలో రూ.118 కోట్ల ఆదాయం వస్తే.. ఏప్రిల్ నెలలో రూ.101 కోట్లు వచ్చింది. ఎన్నికల ప్రభావంతో పాటుగా విద్యార్థులకు పరీక్షల కారణంగా ఆదాయం తగ్గిందంటున్నారు.