
తిరుమల పవిత్రమైన పుణ్యక్షేత్రం దొంగలకు అడ్డాగా మారింది. భక్తులకు మాయమాటలు చెప్పి మత్తుమందు ఇచ్చి దోచుకుంటున్న దొంగల గ్యాంగ్ వ్యవహారం బయటపడింది. తిరుమల వన్ టౌన్ సీఐ విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలలో శ్రీవారి రథం వెనుక భాగంలో గల గేలరీల వద్ద తమిళనాడుకు చెందిన ఒక మహిళను శ్రీవారి దర్శనం చేయిస్తాము అని నమ్మించి తీసుకువచ్చి ఆమెకు ఆహారంలో నిద్ర మాత్రలు కలిపి ఇచ్చి మత్తులో ఉండగా ఆమె బంగారు చైను, చెవి దిద్దులు దోచుకుని వెళ్లారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా గ్యాంగ్ వ్యవహారం బట్టబయలైంది.
Also Read : నెల్లూరు జిల్లాలో నకిలీ ఎస్సై అరెస్ట్
తిరుమల వన్ టౌన్ పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సీసీ కెమెరాలను పరిశీలించి.. వాటి ఆధారంగా పై అనుమానితుల గురించి తమిళనాడు రాష్ట్రంలో ముఖ్య పట్టణాలలో విచారణ మొదలుపెట్టారు. పలు పోలీసు స్టేషన్ లో సందర్శించారు క్రైమ్ రికార్డ్ బ్యూరోలను సంప్రదించారు. నిందితులు V. విజయ్ కుమార్ మరియు వారి పిన్ని శారద లు కలిసి ముఠాగా ఏర్పడి...భక్తులకు మాయమాటలు చెప్పి దొంగతనాలకు పాల్పడుతున్నారు.
తిరుమలలో ఒంటరిగా కనిపించిన భక్తులకు మత్తు మందు ఇచ్చి దొంగతనాలు చేస్తున్న గ్యాంగ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడు రాష్ట్రం విల్లుపురం జిల్లాకు చెందిన శారద (65), విజయకుమార్ (33)ను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై తమిళనాడులో పలు స్టేషన్లలో కేసులున్నాయి. ఎప్పటి కప్పుడు పోలీసుల కళ్లుగప్పి.. అడ్రస్లు మారుస్తే తిరుగుతున్నారు. ఎట్టకేలకు వారిని తిరుమలలో అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 21 గ్రాముల బంగారు నగలు, రూ. 45వేలు, 3 మొబైల్ ఫోన్స్, 6 మత్తు మాత్రలు, మారుతి అల్టో కార్ ను స్వాధీనపరచుకొని వారిని రిమాండ్ కు పంపారు.