డిసెంబర్ 16 నుంచి ధనుర్మాసం ఆరంభమైంది. ధనుర్మాసం సందర్భంగా తిరుమల సుప్రభాత సేవ కార్యక్రమాన్ని మార్చారు. ప్రతిరోజు ఉదయం నిర్వహించే సుప్రభాత సేవకు బదులుగా తిరుప్పావై పాశురాలను నివేదిస్తారు. డిశంబర్ 17 నుంచి జనవరి 14వ తేదీ వరకు సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై కొనసాగుతుంది. ఆ తరువాత యధాతథంగా సుప్రభాత సేవను పునరుద్ధరిస్తారు. శ్రీవారి ఆలయంలో నెల రోజులపాటు జరిగే తిరుప్పావై పారాయణంలో రోజుకు ఒకటి వంతున అర్చకులు పాశురములను నివేదిస్తారు
తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం డిసెంబరు 16వ తేదీన ప్రారంభం కానున్నట్లు తెలిపింది. ఆరోజు ఉదయం 6.57 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభమవుతాయని పేర్కొంది .
ఈ సందర్భంలో సాధారణంగా భోగ శ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీ కృష్ణస్వామివారికి ఏకాంతసేవ నిర్వహిస్తారు. ఈ తిరుప్పావై పఠనం పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది.ధనుర్మాసంలో శ్రీవారికి విశేష కైంకర్యాలు నిర్వహిస్తారు అర్చకులు. బిల్వ పత్రాలతో సహస్ర నామార్చన చేస్తారు. శ్రీవిల్లి పుత్తూరు చిలుకలను ప్రతిరోజూ స్వామివారికి అలంకరిస్తారు. ధనుర్మాసం సందర్భంగా శ్రీవారికి విశేష నైవేద్యాలుగా దోసె, బెల్లం దోసె, సుండుండలు, సీరా, పొంగల్ వంటి ప్రసాదాలను సమర్పిస్తారు.
పురాణాల ప్రకారం ధనుర్మాసంలో దేవతలు సూర్యోదయానికి ఒకటిన్నర గంట ముందుగా నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో శ్రీమహావిష్ణువును ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. ఈ మాసానికి సౌరమానంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉన్నది. 12 మంది ఆళ్వార్లలో శ్రీ ఆండాళ్(గోదాదేవి) ఒకరు. ఆమెను నాచియార్ అని కూడా పిలుస్తారు. వేంకటేశ్వరస్వామివారిని స్తుతిస్తూ ఆండాళ్ రచించిన 30 పాశురాలను కలిపి తిరుప్పావై అంటారు. ఆళ్వార్ దివ్యప్రబంధంలో తిరుప్పావై ఒక భాగం. తమిళ సాహిత్యంలో దీనికి విశేష ప్రాచుర్యం ఉంది. శ్రీవారి ఆలయంలో నెల రోజులపాటు జరిగే తిరుప్పావై పారాయణంలో రోజుకు ఒకటి వంతున అర్చకులు నివేదిస్తారు.