తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల జారీపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నారు. వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి తిరుపతి, తిరుమలలో సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీకి 91 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఈవో శ్యామలరావు వెల్లడించారు. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలన్నీ వచ్చే నెల 10వ తేదీ నుండి ప్రారంభం కానున్నట్లు తెలిపారు. జనవరి 10, 11, 12 తేదీలకు .. జనవరి 9న టోకెన్లు జారీ చేయనున్నారు. తదుపరి రోజులకు ముందు రోజు టోకెన్లు జారీ చేస్తామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు.
భక్తులు ఆధార్ కార్డు చూపించి టోకెన్లు పొందాలని, టోకెన్లు లేని భక్తులకు ఈ పది రోజుల్లో శ్రీవారి దర్శనం ఉండదని స్పష్టం చేశారు. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. కాగా, సర్వదర్శనం టోకెన్లు జారీ కేంద్రాలను ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు పరిశీలించి సమీక్ష జరిపారు.
ఇక గోవింద మాల భక్తులకు ప్రత్యేక టికెట్లను ఇవ్వడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇక జనవరి 10 నుంచి 19 వరకు పది రోజుల పాటు రోజుకు దాదాపు 70 వేలకు పైగా భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేలా టీటీడీ చర్యలు చేపట్టింది. ఇప్పటికే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేసిన రోజుకు 40 వేల చొప్పున 10 రోజులకు 4 లక్షల సర్వదర్శన టోకెన్లను తిరుపతిలో 8, తిరుమలలో ఒక కేంద్రం ద్వారా జారీ చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఏకాదశి మొదలు పది రోజులపాటు వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లకు టీటీడీ పలు చర్యలు తీసుకుందని ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకన్న చౌదరి తెలిపారు