దేశంలో 18వ లోక్ సభ ఎన్నికల మొదటిదశ ప్రారంభమవుతున్నప్పుడు ఎలాంటి ఒక స్పష్టమైన ప్రచారాస్త్రం లేని ఎన్నికలుగా కనిపించాయి. కానీ, ఎన్నికలు రెండవ దశకు చేరుకునేనాటికి దేశంలో అమలవుతున్న రాజ్యాంగం దాని ద్వారా అందిన రిజర్వేషన్లు లాంటి అంశాలు ఎన్నికల ఎజెండాగా, ప్రచారాస్త్రాలుగా మారినాయి. రాజ్యాంగం, రిజర్వేషన్లు లాంటి కీలక అంశాలపై ఎన్నికల ప్రచారం సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ ఒకరిపై మరొకరు పరస్పరం ఆరోపణలు చేసుకోవడంతో.. ఎన్నికల ప్రచారం దేశవ్యాప్తంగా ఒక్కసారిగా వేడెక్కిందనే చెప్పాలి.
భారత రాజ్యాంగాన్ని భారత ఆత్మగా, సామాజిక సమానత్వానికి రిజర్వేషన్లు ఒక సాధనంగా భావిస్తున్న దేశంలో.. రాజ్యాంగం, రిజర్వేషన్లులాంటి కీలక అంశాలు రాజకీయంగా కాకుండా దేశంకోసం, ప్రజల కోసం పనిచేసే వ్యవస్థలుగా చూసినప్పుడే వాటి ప్రాశస్త్యం పెరుగుతుంది. మొదటి దశ ఎన్నికలు ముగిసి, రెండవ దశ ఎన్నికల ప్రచారం ప్రారంభమైన తర్వాత కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల ప్రచారంలో బీజేపీ రాజ్యాంగాన్ని మార్చడానికి, రిజర్వేషన్లను రద్దు చేయడానికి ప్రయత్నిస్తుందనే అంశాన్ని తెరపైకి తెచ్చింది.
రాజ్యాంగం ధర్మగ్రంథం
భారతీయ జనతా పార్టీ నినాదమైన ‘ఫిర్ ఏక్ బార్ మోదీ.. చార్ సౌ పార్’ భారత రాజ్యాంగాన్ని మార్చటానికి రిజర్వేషన్లు రద్దు చేయడానికి అని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తోంది. ఒకరకంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారం దేశంలోని మెజార్టీ వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఆలోచింపజేస్తోంది. కాబట్టే, దిద్దుబాటు చర్యలలో భాగంగా బీజేపీ అగ్రనాయకత్వం ముఖ్యంగా మోదీ, అమిత్ షా మాకు రాజ్యాంగాన్ని మార్చే ఉద్దేశం లేదని, రిజర్వేషన్లను రద్దు చేయబోమని చెప్తున్నారు. ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాజ్యాంగాన్ని ధర్మ గ్రంథంగా భావిస్తానని చెప్తుంటే, భారతీయ జనతా పార్టీ ప్రధాన మద్దతుదారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అసమానతలు ఉన్నంతకాలం రిజర్వేషన్లు కొనసాగుతాయని చెప్తున్నారు.
కానీ, బీజేపీ భావజాలం, బీజేపీ ప్రభుత్వ విధానాలను చూసినప్పుడు వారు చెబుతున్న మాటలను దేశంలోని మెజార్టీ ప్రజలు విశ్వసించటం లేదనే చెప్పాలి. ఈ లోక్ సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ 400 లోక్ సభ స్థానాలలో విజయం సాధిస్తే ఫెడరల్ స్ఫూర్తికి భిన్నంగా రాష్ట్రాలను బలహీనపరుస్తూ అధ్యక్ష తరహా విధానాన్ని తీసుకొస్తారని, రాజ్యాంగాన్ని మార్చటం ద్వారా ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ల విధానాన్ని రద్దు చేస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దేశ సమగ్రతకు నష్టం
తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా..రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ముస్లిం మైనార్టీలకి ఇస్తున్న నాలుగు శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తామని స్పష్టంగా హామీ ఇచ్చింది. అయితే, మతపరమైన రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న బీజేపీ మరొకసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత..రిజర్వేషన్ల విధానంలో మార్పులు చేయబోతున్నారా లేక రిజర్వేషన్లు రద్దు చేసే నిర్ణయం తీసుకోబోతున్నారా అనే అనుమానాలు సర్వత్రా కలుగుతున్నాయి. మోదీ పదేపదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడ్డాయని విమర్శిస్తుంటారు. కానీ, కాంగ్రెస్ తన సుదీర్ఘ పాలనా కాలంలో దేశంలో మతాలు, ప్రాంతాలు, కులాల మధ్య అవలంబించిన సామరస్య పూర్వక విధానాన్ని మోదీ బుజ్జగింపు రాజకీయంగా వర్ణిస్తున్నారు.
మోదీ ప్రభుత్వం ఒక వర్గం పట్ల అనుసరిస్తున్న వివక్ష పట్ల ఆ వర్గాలు అభద్రతకు గురై దేశంలో శాంతిభద్రతల సమస్యగా మారితే అది దేశ సమగ్రతకు నష్టం చేస్తుంది. కాంగ్రెస్ పాలనలో వివిధ వర్గాల మధ్య ఉన్న సౌభ్రాతృత్వం ఇప్పుడు దేశంలో కనిపిస్తుందా అని ప్రశ్నించుకోవాలి. మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చినా, రాకపోయినా దేశ సమగ్రతని కాపాడే రాజ్యాంగం వివిధ వర్గాల సమానత్వం కోసం ఇస్తున్న రిజర్వేషన్లకి వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. వాటిని రద్దు చేయటం సాధ్యం కాదు, ప్రజలు హర్షించరనే విషయం కూడా తెలుసు. లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మోదీ మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు. రిజర్వేషన్లు ఎత్తివేస్తారనే అనుమానాలు రాజకీయంగా భారతీయ జనతా పార్టీకి నష్టం చేకూర్చబోతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ముస్లిం రిజర్వేషన్లు రద్దు
గతంలో మోదీ ప్రభుత్వం రాజ్యాంగ పీఠిక నుంచి సెక్యులర్, సోషలిస్ట్ అనే పదాలను తొలగించటానికి ప్రయత్నించిందనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఈడబ్ల్యూఎస్ 10 శాతం రిజర్వేషన్లు తీసుకురావడం రిజర్వేషన్లను మరింత హేతుబద్ధంగా అమలుచేయడానికి, దేశవ్యాప్తంగా కులగణన చేయాలనే డిమాండ్ పట్ల మోదీ ప్రభుత్వం సానుకూలంగా లేకపోవడం వలన రిజర్వేషన్లను రద్దు చేస్తారనే ఆరోపణలకు బలం చేకూరుతుంది. 18వ లోక్ సభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాకముందు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. మూడవ పర్యాయం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోబోతున్నామని వ్యాఖ్యానించారు.
పెద్ద నిర్ణయాలు అంటే రాజ్యాంగాన్ని మార్చటం, రిజర్వేషన్లను ఎత్తివేయటమేనా అనే అనుమానాలు కలగకమానవు. భారతీయ జనతా పార్టీ మతపరమైన రిజర్వేషన్లకి మేము వ్యతిరేకమని స్పష్టం చేయడమే కాదు, 2023లో జరిగిన కర్నాటక శాసనసభ ఎన్నికలకు ముందు.. కర్నాటకలోని బొమ్మై నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు ఇస్తున్న నాలుగు శాతం రిజర్వేషన్లను రద్దుచేసింది. ఆ రిజర్వేషన్లను వొక్కలిగ, లింగాయత్ కమ్యూనిటీలకు పంపిణీ చేసింది.
- డాక్టర్
తిరునాహరి శేషు,
పొలిటికల్ ఎనలిస్ట్, కాకతీయ యూనివర్సిటీ