తమిళనాడులో ఓ ఐపీఎస్ అధికారి క్రూరంగా వ్యవహరించారు. ఓ కేసులో అనుమానితులను కస్టడీలోకి తీసుకున్న తిరునల్వేలి జిల్లా అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బల్వీర్ సింగ్..వారిని చిత్ర హింసలకు గురిచేశారు. అనుమానితుల పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించారు. అనుమానితుల వృషణాలను చితక్కొట్టి..పళ్లను పట్టుకారుతో పీకాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో బల్వీర్ సింగ్ ను సీఎం ఎంకే స్టాలిన్ సస్పెండ్ చేశారు.
మానవ హక్కుల ఉల్లంఘనపై రాజీ పడం
అనుమానితుల పట్ల క్రూరంగా వ్యవహరించిన ఏఎస్పీ బల్వీర్ సింగ్ ను సస్పెండ్ చేయమని ఆదేశించినట్లు సీఎం ఎంకే స్టాలిన్ తెలిపారు. మెజిస్ట్రియల్ విచారణ నుండి నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసు స్టేషన్లలో మానవ హక్కుల ఉల్లంఘనపై రాజీ పడబోమని తెలిపారు. ఈ ఘటన మీద విచారణ కోసం సిట్‌ను ఏర్పాటు చేసినట్లు కూడా వెల్లడించారు. జిల్లా కలెక్టర్ ఎండీ షబ్బీర్ అలం, సబ్ కలెక్టర్ చేరన్ మహాదేవి నేతృత్వంలో విచారణకు ఆదేశించారు.
అసలు ఆరోపణలేంటి?
మార్చి 23న తిరునల్వేలి జిల్లాలోని అంబసముద్రంలో ఏఎస్పీ 2020 బ్యాచ్ ఐపిఎస్ అధికారి బల్వీర్ సింగ్... ఓ కేసులో అనుమానితులైన ఐదుగురిని కస్టడీలోకి తీసుకున్నారు. ఈ సమయంలో కటింగ్ ప్లేయర్‌తో ఈ ఐదుగురు వ్యక్తుల దంతాలను పీకేశాడు. అందులో కొత్తగా పెళ్లయిన ఓ వ్యక్తి వృషణాల మీద తీవ్రంగా కొట్టాడు. ఆ తర్వాత వారు బెయిల్ పై విడుదలయ్యారు. వీరిలో కొందరు తమను ఏఎస్పీ చిత్రహింసలకు గురిచేసినట్లు వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది తమిళనాడు వ్యాప్తంగా సంచలనం రేపింది. దీనిపై సీఎం స్టాలిన్ స్పందించి..బల్వీర్ సింగ్ ను సస్పెండ్ చేశారు. జిల్లా కలెక్టర్ ఇప్పటికే బల్వీర్ సింగ్‌పై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. అయితే ఈ ఘటనపై మానవ హక్కుల కార్యకర్తలు భగ్గుమన్నారు. బల్వీర్ సింగ్ పై క్రిమినల్ కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
బల్వీర్ సింగ్ పై గతంలోనూ ఆరోపణలు
2020లోనూ బల్వీర్ సింగ్ వల్ల ఇద్దరు చనిపోయారు. టుటికోరిన్ జిల్లాలోని సాతంకుళం పోలీస్ స్టేషన్‌లో కస్టడీలో ఉన్న తండ్రికొడుకు జయరాజ్, బెనిక్స్లను చిత్రహింసలకు గురిచేయడంతో...వారు మరణించారు. ఆ తర్వాత అంబసముద్రం ఏఎస్పీగా బల్వీర్ సింగ్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. కొద్దిరోజుల కిందట సీసీ కెమెరా ధ్వంసం చేసిన కేసులో జమీన్ సింగపట్టికి చెందిన సూర్య అనే వ్యక్తిని పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లి..అతని పన్ను పీకేశారు. మరో ముగ్గురి పళ్లు విరగ్గొట్టారు.