
మెట్‌పల్లి, వెలుగు: చదువు కోసం లండన్ వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఓ స్డూడెంట్‌ను మోసం చేసి రూ. 6 లక్షలు కాజేసిన వ్యక్తి రెండేండ్ల తరువాత పోలీసులకు పట్టుబట్టాడు. శుక్రవారం మెట్‌పల్లి సీఐ నిరంజన్‌రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన మామిడాల నితీశ్‌కుమార్ ఉన్నత చదువుల కోసం 2023లో లండన్ లో ఓ యూనివర్శిటీలో అడ్మిషన్ కోసం ప్రయత్నాలు చేశాడు.
ఆ సమయంలో టెలిగ్రాం యాప్ లో పరిచయమైన తిరుపతికి చెందిన షణ్ముఖ కృష్ణ యాదవ్ ఇండియా కరెన్సీతో ఫీజులు కడితే ఎక్కువ డబ్బులు ఖర్చవుతాయని, తన అకౌంట్ కు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలని, లండన్ కరెన్సీ ద్వారా ఫీజు కడితే తక్కువ డబ్బులు ఖర్చవుతాయని నమ్మించాడు. బ్యాంక్ ఖాతా వివరాలు, పాస్‌పోర్ట్ వివరాలు పంపించడంతో నమ్మి రూ.6 లక్షలు కృష్ణయాదవ్ ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేశారు.
ఆ తరువాత కృష్ణయాదవ్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగిన కృష్ణ యాదవ్ ను గుర్తించిన ఇమ్మిగ్రేషన్ అధికారులు మెట్ పల్లి సీఐకు సమాచారం అందించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు.