తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయంలో గురువారం ( జూన్ 1) అపశ్రుతి చోటు చేసుకుంది. ఆలయ ధ్వజస్తంభం వద్దనున్న వందేళ్ల పెద్ద రావిచెట్టు కూలి భక్తుడు మృతి చెందాడు. ముగ్గురు భక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. మృతుడు కడపకు చెందిన డాక్టర్ గుర్రప్పగా గుర్తించారు పోలీసులు. భారీ ఈదురు గాలులకు వందల ఏళ్ల నాటి రావి చెట్టు కుప్ప కూలింది. దీంతో టీటీడీ అధికారులు ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు.
సమాచారం అందుకున్న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి క్షతగాత్రులను పరామర్శించారు. మృతుడు గుర్రప్ప కుటుంబానికి జరిగిన బాధను భర్తీ చేయలేమని ఆయన విచారం వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి ఐదు లక్షల రూపాయిలను ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. చెట్టు కూలిన ఘటనలో గాయపడిన వారిలో ఒకరికి కాలు విరగగా.. మరొకరి తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు వైవీ సుబ్బారెడ్డి.