కల్తీ నెయ్యిని లడ్డూలో వాడినట్లు ఆధారాలు ఎక్కడ: దేవుడిని అయినా రాజకీయాలకు దూరం పెట్టండి : సుప్రీంకోర్టు

కల్తీ నెయ్యిని లడ్డూలో వాడినట్లు ఆధారాలు ఎక్కడ: దేవుడిని అయినా రాజకీయాలకు దూరం పెట్టండి : సుప్రీంకోర్టు

తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి.. అంటే జంతువుల కొవ్వు ఆయిల్ వాడినట్లు ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు.. ఆ తర్వాత జరిగిన పరిణామాలపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు వేశారు. పిటిషన్ దాఖలు చేసిన వారిలో టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ప్రముఖ న్యాయవాది సుబ్రమణ్యస్వామి ఉన్నారు. ఈ పిటిషన్లపై విచారణ చేసిన సుప్రీంకోర్టు పలు ప్రశ్నలను సంధించటంతో పాటు.. కీలక వ్యాఖ్యలు చేసింది.

ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన న్యాయవాదులకు సుప్రీం కోర్టు కొన్ని సూటి ప్రశ్నలు సంధించింది. కనీసం దేవుడినైనా రాజకీయాల నుంచి దూరంగా పెట్టండని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. నెయ్యి రిపోర్ట్‌పై సెకండ్‌ ఒపీనియన్‌ తీసుకున్నారా అని ప్రశ్నించింది. లడ్డూ కల్తీ జరిగిందని తేల్చడం కోసం శాంపిల్‌ ల్యాబ్‌కు పంపారా అని నిలదీసింది. ఇతర సప్లయర్ల నుంచి శాంపిల్స్‌ ఎందుకు తీసుకోలేదని అడిగింది. నెయ్యి కల్తీ జరిగినట్లు సాక్ష్యం చూపించండని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

తిరుమల లడ్డూపై వివాదం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు చేరిన సంగతి తెలిసిందే. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై  నిజానిజాలను నిగ్గు తేల్చాలని దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపింది. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, రాజ్యసభ మాజీ సభ్యుడు సుబ్రమణ్యస్వామితో పాటు మరో ముగ్గురు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీం కోర్టులో సోమవారం(సెప్టెంబర్ 30, 2024)  విచారణ జరిగింది. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ బెంచ్ ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించి, వాదనలు వినడం గమనార్హం.