తిరుమల కల్తీ నెయ్యి కేసులో నలుగురు అరెస్ట్..

తిరుమల కల్తీ నెయ్యి కేసులో నలుగురు అరెస్ట్..

తిరుమల కల్తీ నెయ్యి కేసులో సీబీఐ విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే.. ఈ  కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది.. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన సిట్ బృందం నెయ్యి సరఫరా చేసిన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుంది. తమిళనాడకు చెందిన ఏఆర్‌ డెయిరీ, ఉత్తరప్రదేశ్‌కు చెందిన పరాగ్‌ డెయిరీ, ప్రిమీయర్‌ అగ్రి ఫుడ్స్, ఆల్ఫా మిల్క్‌ ఫుడ్స్‌ సంస్థలకు సంబంధించిన కీలక వ్యక్తులను మూడు రోజులుగా తిరుపతిలో విచారిస్తోన్న సిట్ బృందం ఆదివారం ( ఫిబ్రవరి 9, 2025 ) నలుగురిని అదుపులోకి తీసుకుంది.  విచారణకు సహకరించకపోవడం, కల్తీ నెయ్యి ఘటనలో వారి ప్రమేయం ఉన్నట్టు ప్రాథమిక ఆధారాలు లభ్యం కావడంతో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఉత్పత్తి సామర్ధ్యానికి మించి ఎక్కువ మొత్తంలో నెయ్యి సరఫరా చేసేందుకు పలు ఉత్తరాది డైయిరీ సంస్థల నుంచి నెయ్యి కొనుగోలు చేసినట్లు గుర్తించిన సీబీఐ.. సుదీర్ఘ విచారణ తర్వాత ప్రీమియర్ అగ్రి ఫుడ్స్, పరాగ్‍ డైయిరీ, ఆల్ఫా మిల్క్ ఫుడ్స్, ఏఆర్ డైయిరీకి సంబంధించిన విపిన్‍ గుప్త, పోమిల్‍ జైన్‍, అపూర్వ చావడ, రాజశేఖర్‌లను అదుపులోకి తీసుకుంది. సోమవారం ( ఫిబ్రవరి 10, 2025 ) వీరిని కోర్టులో హాజరుపరచనున్నట్లు సమాచారం. 

సిట్ ఆఫీసులో రోజంతా టెన్షన్ టెన్షన్:

ఈ కేసు విచారణ సందర్భంగా తిరుపతి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్సులో ఆదివారం హైడ్రామా సాగింది. ఏఆర్‌ డెయిరీ, వైష్ణవీ డెయిరీల డైరెక్టర్లను అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు, సిబ్బంది ఉరుకులు పరుగులు తీయడంతో హడావిడి నెలకొంది. రాత్రి 9 గంటల ప్రాంతంలో నిందితులను జడ్జిల నివాస సముదాయం దగ్గరకు తీసుకెళ్లగా జడ్జి అనుమతి కోసం పోలీసులు రోడ్డుకిరువైపులా నిరీక్షించారు. రాత్రి 11 గంటలకు జడ్జి ఎదుట నిందితులను హాజరు పరిచారు. 

ALSO READ | ఏపీలో ఘోరం: ట్రాక్టర్ బోల్తా.. నలుగురు మహిళలు మృతి..

అంతకు మునుపు జడ్జిల నివాస సముదాయం ఎదుట రోడ్డుపైనే నిందితులకు పోలీసు అధికారులు గుర్తింపు పరీక్షలు నిర్వహించారు.ఈఎస్ఐ హాస్పిటల్ గేటు దగ్గరే వీధి దీపాల కింద నిందితులను నిలబెట్టి గుర్తింపు పరీక్షలు నిర్వహించడం హైడ్రామాకు దారి తీసింది.