తిరుమల లడ్డూ వివాదం..రంగంలోకి కేంద్రం

తిరుమల లడ్డూ వివాదం..రంగంలోకి కేంద్రం
  •     నివేదిక ఇవ్వాలని ఏపీ సర్కార్​కు ఆదేశం మంత్రులతో చంద్రబాబు సమీక్ష.. 
  •     బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడి
  •     నెయ్యిలో కల్తీ జరిగిందన్న టీటీడీ ఈవో
  •     చంద్రబాబు కామెంట్లను ఖండించిన వైసీపీ
  •     అత్యవసర విచారణకు హైకోర్టులో పిటిషన్

న్యూఢిల్లీ : తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి ప్రసాదమైన లడ్డూ తయారీ.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గత వైసీపీ ప్రభుత్వం లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వాడిందన్న వివాదంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నెయ్యిలో గొడ్డు కొవ్వు, ఫిష్ ఆయిల్ అవశేషాలు ఉన్నట్లు గుజరాత్‌‌‌‌కు చెందిన నేషనల్‌‌‌‌ డెయిరీ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ బోర్డు (ఎన్‌‌‌‌డీడీబీ) కాఫ్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌ తన రిపోర్టులో అనుమానం వ్యక్తం చేసింది. దీనిపై కేంద్రం స్పందించి.. ఏపీ ప్రభుత్వం నుంచి నివేదిక కోరింది. అత్యంత పవిత్రమైన తిరుమలలో జరిగిన ఈ అపచారంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిపిన కల్తీ నెయ్యి వాడుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు రాజకీయంగా మరింత అగ్గి రాజేశాయి. ఈ నేపథ్యంలో సెక్రటేరియెట్​లో శుక్రవారం ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఎన్​డీడీబీ ఇచ్చిన రిపోర్టుపై సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, మంత్రులతో చర్చించారు. లడ్డూ తయారీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. లడ్డూ వివాదంపై టీటీడీ ఈవో శ్యామల రావు కూడా స్పందించారు. లడ్డూల తయారీలో ఉపయోగించిన నెయ్యిలో నాణ్యత లేదని, భారీగా కల్తీ జరిగినట్టు ల్యాబ్‌‌‌‌ టెస్ట్​లో స్పష్టమైందన్నారు.

జంతువుల కొవ్వు కలిసినట్టు తేలిందని అన్నారు. ప్రభుత్వ ఆరోపణలను వైసీపీ నేతలు ఖండించారు. కాగా, లడ్డూ వ్యవహారంపై ఏపీ హైకోర్టులో వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. పిటిషన్లపై బుధవారం విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. సుప్రీం కోర్టులోనూ లెటర్ పిటిషన్ దాఖలైంది. అడ్వొకేట్ ద్వారా జర్నలిస్ట్ సురేశ్ చౌహాన్కే సీజేఐకి లేఖ రాశారు. 

ల్యాబ్ రిపోర్టులో ఏమున్నది?

వైసీపీ పాలనలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన నేషనల్‌‌‌‌ డెయిరీ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ బోర్డు (ఎన్‌‌‌‌డీడీబీ) కాఫ్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌ ల్యాబ్ అనుమానం వ్యక్తం చేసింది. జులై 12న టీటీడీ అధికారులు ఆవు నెయ్యి శాంపిల్స్‌‌‌‌ ల్యాబ్​కు పంపించారు. నెయ్యిలో సోయాబీన్, పొద్దు తిరుగుడు, ఆలివ్, గోధుమ బీన్, మొక్కజొన్న, పత్తి గింజలతోపాటు చేప నూనె, బీఫ్ టాలో, పామాయిల్, పంది కొవ్వు ఉన్నట్లు ఎన్​డీడీబీ అనుమానం వ్యక్తం చేసింది. పాలకు సంబంధించినవి కాకుండా ఇతరత్రా కొవ్వులు (ఫారిన్‌‌‌‌ ఫ్యాట్స్‌‌‌‌) ఉన్నట్లు తేల్చింది. నిర్దేశిత ప్రమాణాల ప్రకారం నెయ్యిలో ఉండాల్సిన ‘ఎస్‌‌‌‌ - విలువ’ కంటే పరీక్షించిన నమూనాల్లో చాలా తేడాలు ఉన్నాయి. 

నందినిని కాదని..ఏఆర్ డెయిరీ

గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తిరుమల లడ్డూల తయారీకి కర్నాటక నుంచి సరఫరా అయ్యే నందిని నెయ్యిని వాడేవారు. వైసీపీ వచ్చాక నందిని నెయ్యి వాడకాన్ని ఆపేసి తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ ప్రొడక్ట్స్ ఉపయోగించడం మొదలుపెట్టింది.  టీటీడీకి నెయ్యి ఈ కంపెనీనే సరఫరా చేస్తున్నది. టెండర్లు, రివర్స్ టెండర్లు వేసి.. అతి తక్కువ ధరలకు కాంట్రాక్టులను దక్కించుకుందనే ఆరోపణలు ఉన్నాయి. బటర్ ఆయిల్‌‌‌‌ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుని నెయ్యిగా మార్చి టీటీడీకి సప్లై చేసేదనే విమర్శలున్నాయి. 

ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌లో జరిగిన టెండర్లలో కేజీ నెయ్యి రూ.610కిగానూ.. రివర్స్ టెండర్లలో రూ.424కి మాత్రమే సరఫరా చేస్తామని ఆ కంపెనీ అంగీకరించింది. అంటే కేజీకి రూ.190కిపైగా తగ్గించి టెండర్లు దక్కించుకున్నది. 2022లోనూ ఇలాగే చేసింది. టెండర్లలో రూ.414 కు కోట్ చేసి.. రివర్స్ టెండర్లలో రూ.337కు కోట్ చేసి టెండర్ దక్కించుకున్నట్లు రికార్డుల్లో ఉంది. లడ్డూల తయారీకి మొత్తంగా ఐదు కంపెనీలు నెయ్యిని సరఫరా చేస్తున్నాయి. 

ఎలాంటి విచారణకైనా సిద్ధం : ఏఆర్ డెయిరీ​

టీటీడీకి సప్లై చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఏఆర్ డెయిరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్కొన్నది. ఎలాంటి న్యాయపరమైన విచారణకైనా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది. తామేం తప్పు చేయలేదని నిరూపించుకుంటామని చెప్పింది. జూన్, జులైలో టీటీడీకి పంపిన నెయ్యి అంతా అక్కడి అధికారులు తిరిగి పంపించేశారని తెలిపింది. క్వాలిటీ నెయ్యినే పంపించామని, టెస్ట్ చేశాకే లారీలు కంపెనీ నుంచి బయటికెళ్తాయని వివరించింది. టెస్టు రిపోర్టు కూడా లారీలతోనే టీటీడీకి పంపిస్తామని తెలిపింది. 

బాధ్యులపై చర్యలు తీసుకుంటాం : కేంద్రం

తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఆరా తీశారు. ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన నివేదిక ఇవ్వాలని కోరారు. ఫుడ్‌‌‌‌ సేఫ్టీ అండ్‌‌‌‌ స్టాండర్డ్స్‌‌‌‌ అథారిటీ ఆఫ్‌‌‌‌ ఇండియా నిబంధనల ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. లడ్డూల తయారీకి వాడే నెయ్యిలో బీఫ్ ఫ్యాట్, ఫిష్ ఆయిల్ ఉందన్న చంద్రబాబు కామెంట్లను కేంద్రం సీరియస్​గా తీసుకున్నదని ఫుడ్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి తెలిపారు. 

బాధ్యులపై ప్రతి భక్తుడు బాధపడ్తున్నడు : రాహుల్ గాంధీ

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఆలయంలో లడ్డూ ప్రసాదం అపవిత్రమైందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ అన్నారు. వెంకటేశ్వర స్వామిని ప్రపంచ వ్యాప్తంగానూ కోట్లాది మంది పూజిస్తారని తెలిపారు. తిరుపతిలో ప్రసాదాల కల్తీ అంశం ప్రతి భక్తుడిని బాధపెడ్తున్నదని వివరించారు. కల్తీపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. పుణ్యక్షేత్రాల పవిత్రతను కాపాడాలని ట్విట్టర్​లో కోరారు.

హిందువులు మనోభావాలు దెబ్బతీశారు : సంజయ్

తిరుమల లడ్డూను కల్తీ చేయడం క్షమించరాని నేరమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు ఆయన లేఖ రాశారు. ‘లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యిని, చేప నూనెను వినియోగించారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు.. హిందువుల మనోభావాలను తీవ్రంగా కలిచి వేస్తున్నాయి’’అని లేఖలో సంజయ్ పేర్కొన్నారు.

నివేదిక అందగానే చర్యలు : సీఎం చంద్రబాబు

హిందువులకు వేంకటేశ్వరస్వామి కలియుగ దేవుడని, ఇలా లడ్డూను అపవిత్రం చేస్తారని ఎవరూ ఊహించలేదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ‘‘ఎవరైనా శ్రీవారికి అపచారం తలపెడితే.. వచ్చే జన్మలో కాదు, ఈ జన్మలోనే శిక్షిస్తాడని అందరూ  నమ్ముతారు. అపచారానికి పాల్పడ్డ వారిన ఏం చేయాలో అర్థం కావడం లేదు. నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు ల్యాబ్ అనుమానం వ్యక్తం చేసింది. దీనిపై నివేదిక ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించాను’’అని చంద్రబాబు అన్నారు.

పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తిరుమల లడ్డూ వివాదానికి కారణమైనవాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. స్వచ్ఛమైన నెయ్యి అంత తక్కువ ధరకు ఎలా దొరుకుతుందని గత వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 

చంద్రబాబు దుర్మార్గంగా మాట్లాడుతున్నరు : జగన్

తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు సీఎం చంద్రబాబు కట్టుకథలు చెప్తున్నారని వైసీపీ చీఫ్ జగన్ ఆరోపించారు. లడ్డూ వ్యవహారంపై ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ‘‘నెయ్యికి బదులు జంతు కొవ్వు వాడారని దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్నరు. సీఎంగా ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటం కరెక్టేనా? దశాబ్దాల నుంచి ఒకే విధానంలో లడ్డూ తయారీ సామాగ్రి కొనుగోలు చేస్తున్నం. ప్రతి ట్యాంకర్‌‌‌‌ ఎన్‌‌‌‌ఏబీఎల్‌‌‌‌ సర్టిఫికెట్‌‌‌‌ తీసుకుని రావాలి. 

ఆ తర్వాత టీటీడీ మూడు శాంపిల్స్‌‌‌‌ను తీసుకుని టెస్ట్‌‌‌‌ చేస్తుంది. ఈ టెస్ట్‌‌‌‌లు పాసైతేనే ఆ సామాగ్రిని టీటీడీ అనుమతిస్తుంది. ఈ విధానమంతా దశాబ్దాల నుంచి జరుగుతుంది’’అని జగన్ అన్నారు. జులై 12న శాంపిల్స్‌‌‌‌ తీసుకున్నారని, ఆ టైమ్​లో సీఎంగా ఉన్నది చంద్రబాబే అని తెలిపారు. టీటీడీ పరువును బజారు కీడుస్తున్నారని, ఈ విషయంపై సీజేఐ, ప్రధాని మోదీకి లేఖ రాస్తామన్నారు.

నెయ్యిలో జంతువుల కొవ్వు ఉంది : టీటీడీ ఈవో

శ్రీవారి లడ్డూ నాణ్యతపై కొంతకాలంగా ఫిర్యాదులు వస్తున్నాయని, తయారీకి ఉపయోగించే నెయ్యిని టెస్ట్ ల కోసం పంపిస్తే అందులో జంతువుల కొవ్వు ఉన్నట్లు తేలిందని టీటీడీ ఈవో శ్యామల రావు అన్నారు. దేశవ్యాప్తంగా లడ్డూపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నెయ్యిలో నాణ్యతా లోపాన్ని నేను కూడా గమనించాను. టెస్ట్ చేసేందుకు టీటీడీకి సొంత ల్యాబ్ లేదు. 

నెయ్యి శాంపిల్స్​ను గుజరాత్​లోని ఎన్‌‌‌‌డీడీబీ ల్యాబ్‌‌‌‌కు పంపాం. నాణ్యత 100 పాయింట్లకు బదులు 20 పాయింట్లే ఉందని రిపోర్టు వచ్చింది. కేజీ ఆవు నెయ్యి రూ.320కే ఎలా వస్తుంది? దీన్ని బట్టే క్వాలిటీని అర్థం చేసుకోవచ్చు. నెయ్యి చూస్తే నూనెలాగా ఉండేది. ఈ అనుమానంతోనే టెస్టింగ్ చేయించాం’’అని శ్యామల రావు అన్నారు.

భయంకరమైన, నమ్మలేని నిజమిది : రంగరాజన్

తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీపై సమగ్ర విచారణ జరపాలని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ కోరారు. ‘భయంకరమైన, నమ్మలేని నిజమిది’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో రిలీజ్ చేశారు. తిరుమలలో ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమన్నారు. టెండరింగ్‌‌‌‌ ప్రక్రియే తప్పు అని విమర్శించారు.