లెజండరీ లతా మంగేష్కర్ చివరి కోరికను నెరవేర్చిన బంధువులు.. అది ఏంటంటే..

దివంతగ గాయని లతా మంగేష్కర్ చివరి కోరికను ఆమె కుటుంబ సభ్యులు నెరవేర్చారు. టీటీడీకి ఆమె తరఫున కుటుంబ సభ్యులు రూ.10 లక్షల చెక్కును అందజేశారు. ఆమె గతంలో తిరుపతి ట్రస్టు ఆస్థాన సంగీత విద్వాంసురాలిగా పని చేశారు.  

దివంగత లెజెండరీ గాయని లతా మంగేష్కర్ చివరి కోరిక నెరవేరింది. ఆమె చనిపోయే ముందు తిరుమల శ్రీవారికి విరాళం ఇవ్వాలని చివరి కోరికగా భావించారు. దానిని ఆమె కుటుంబ సభ్యులు తాజాగా నెరవేర్చారు. లతా మంగేష్కర్ తరఫున ఆమె కుటుంబం తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.10 లక్షల విరాళాన్ని అందజేసింది.

లతా మంగేష్కర్ తరఫున రూ.10 లక్షలు విరాళంగా ఇవ్వనున్నట్లు ఆమె కుటుంబం టీటీడీకి రాసిన లేఖలో పేర్కొంది. అలాగే మంగేష్కర్ కుటుంబం తరపున ఆలయానికి విరాళం ఇవ్వాలని కోరుతూ ఆమె సోదరి ఉషా మంగేష్కర్ ముంబైకి చెందిన టీటీడీ బోర్డు సభ్యుడు మిలింద్ కేశవ్ నర్వేకర్ ను వ్యక్తిగతంగా కోరారు. దీంతో వారంతా సోమవారం ( అక్టోబర్ 9)  తిరుమలలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సమక్షంలో విరాళం చెక్కును టీటీడీ కార్యనిర్వహణాధికారి ఏవీ ధర్మారెడ్డికి అందజేశారు.

కాగా.. గాయని లతా మంగేష్కర్ కు వేంకటేశ్వర స్వామికి పెద్ద భక్తురాలు. ఆమె గతంలో తిరుపతి ట్రస్టు ఆస్థాన సంగీత విద్వాంసురాలిగా కూడా పనిచేశారు. 2010లో ఆమె పాడిన సుమారు 10 తాళ్ళపాక అన్నమాచార్య సంకీర్తనలను టీటీడీ ఎస్.వీ రికార్డింగ్ ప్రాజెక్ట్ రికార్డ్ చేసింది. తరువాత ‘‘అన్నమయ్య స్వర లతర్చన’’ పేరుతో ఆడియో సీడీలుగా టీటీడీ విడుదల చేసింది. 

లతామంగేష్కర్ మనల్ని వదిలి వెళ్ళిపోయినా ఆమె పాటలు ఎప్పటికి శాశ్వతంగా ఉంటూ మనకు వినిపిస్తూనే ఉన్నాయి. 2022  ఫిబ్రవరి 6న లతా మంగేష్కర్  కన్నుమూశారు. లతామంగేష్కర్ 20 భాషల్లో దాదాపు 50 వేలకు పైగా పాటలు ఆలపించారు . మధురమైన ఆమె గాత్రం తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. దాదాపు 980   పైగా సినిమాల్లో లతామంగేష్కర్ పాటలు పాడారు. ఆమె గానానికి క్వీన్ ఆఫ్ మెలోడీ, నైటింగేల్ ఆఫ్ ఇండియా అలాగే వాయిస్ ఆఫ్ ది మిలీనియం అనే బిరుదులను సొంతం చేసుకున్నారు  1989లో భారత ప్రభుత్వం ఆమెకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రదానం చేసింది. ఆమె మరణంతో సంగీత లోకం ఒక్కసారిగా మూగబోయింది. లతా మంగేష్కర్  మరణాన్ని ఇప్పటికి ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఆమె చివరి కోరికను కుటుంబసభ్యులు తాజాగా నెరవేర్చారు. చివరి రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళం ఇవ్వాలని అనుకున్నారు. ఈమేరకు ఆమె తన విల్లులో కూడా రాసుకున్నారు.

ALSO READ : Cricket World Cup 2023: బంగ్లాదేశ్‌పై  ఇంగ్లాండ్ రికార్డుల మోత..ఆల్‌టైం రికార్డ్ బ్రేక్ చేసిన మలాన్