తిరుపతి మాలల సింహగర్జన అనుమతులు రద్దు : సభ వాయిదా వేసిన నిర్వాహకులు

తిరుపతి మాలల సింహగర్జన అనుమతులు రద్దు : సభ వాయిదా వేసిన నిర్వాహకులు

తిరుపతి - శ్రీకాళహస్తి: తిరుపతిలో మార్చి 23న (ఆదివారం) జరగాల్సిన ‘రాయలసీమ మాలల సింహగర్జన భారీ బహిరంగ సభ’ వాయిదా పడింది. ప్రభుత్వం సభకు అనుమతులను రద్దు చేయడంతో తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు జేఏసి నేతలు ప్రకటించారు.  సభ అనుమతి రద్దు చేయడం సరికాదని ఈ సందర్భంగా నేతలు అన్నారు. కులగణన ప్రకారం సమన్యాయం చేయకుండా రాజ్యాంగం కల్పించిన హక్కులను హరించడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు.

విభజన పేరుతో మాలలకు జరిగిన అన్యాయంపై అసెంబ్లీలో గొంతు విప్పకపోతే ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు జేఏసీ నాయకులు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పు  తర్వాత దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలుగు రాష్ర్టాల్లో హుటాహుటిన అమలు చేయడంపై ప్రశ్నించారు. 

ALSO READ | ఇండియాలో టాప్-10 రిచ్చెస్ట్ ఎమ్మెల్యేలు వీళ్లే.. టాప్ ప్లేస్ ఎవరిదంటే..

తెలంగాణాలో ఎస్సీ వర్గీకరణలో సమన్యాయం పాటించారని.. అయితే ఆంధ్రరాష్ర్టంలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. కులగణన చేసిన తర్వాతే వర్గీకరణ అమలు చేయాలని డిమాండ్ చేశారు. జనాభా ప్రాతిపదికన వాటాలు కల్పించాలని.. హక్కులను హరించే క్రిమిలేయర్ ను వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం (మార్చి 21) జరిగిన మీడియా సమావేశంలో మాలల జేఏసీ, జై భీమ్ ఆర్మీ నాయకులు పులి శ్రీకాంత్, అల్లం మణి, బీఎస్ఎన్ఎల్ నాగరాజు, చారులత, పోతుల చంద్ర, రాజేంద్ర, కస్తూరయ్య తదితరులు పాల్గొన్నారు.