'డిజిటల్ అరెస్ట్' పేరుతో అమాయకుల్ని మోసం చేస్తూ లక్షల్లో దోచేస్తున్న ముఠాను తిరుపతి పోలీసులు పట్టుకున్నారు. ఒకరిని అరెస్టు చేసిన తిరుపతి జిల్లా వెస్ట్ పోలీసులు.. నిందితుడి వద్ద నుంచి 24.5 లక్షలు నగదు, రెండు సెల్ ఫోన్లు, రెండు ల్యాప్ టాప్స్, ఒక కారు, 16 గ్రాములు బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి అకౌంట్లలోని రూ. 26 లక్షలను ఫ్రీజ్ చేశారు.
వృద్ధురాలిని భయపెట్టి రూ.2.5 కోట్లు కొట్టేశారు..
తిరుపతి నగరానికి చెందిన ఓ వృద్ధురాలిని(65) 'డిజిటల్ అరెస్ట్' పేరుతో భయపెట్టిన కేటుగాళ్లు.. బాధితురాలు నుంచి రూ.2.5 కోట్లు కొట్టేశారు. వాట్సప్ ద్వారా వీడియో కాల్ చేసిన మోసగాళ్లు.. తాము ఢిల్లీ సీబీఐ అధికారులమని చెప్పి బాధితురాలి పేరుపై రూ. 200 కోట్లు మనీ ల్యాండరింగ్ కేసు జరిగిందని భయపెట్టారు. ఆమె తడబడటం గమనించిన డిజిటల్ అరెస్ట్ ముఠా.. బాధితురాలు పేరు మీద ఉన్న బ్యాంక్ అకౌంట్ చట్ట వ్యతిరే కార్యకలాపాలకు వినియోగించినట్లు.. అందువల్ల ఆమెను అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు.
అరెస్ట్ చేయడం తథ్యమని భయపెట్టిన ముఠా.. దానిని నుంచి బయట పడేందుకు దారులు ఉన్నాయని బాధితులరాలికి మాయ మాటలు చెప్పి ఆమె నుంచి 2.5 కోట్లు రూపాయలను వివిధ అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఈ ఘటన పట్ల మోసపోయానని గ్రహించిన బాధితురాలు.. ఈ నెల 13వ తేదీన తిరుపతి జిల్లా వెస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
ఈ కేసును సవాల్‌గా తీసుకున్న తిరుపతి సైబర్ క్రైమ్ టీం మరియు వెస్ట్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ చాకచక్యంగా ముఠాను పట్టుకున్నారు. ప్రస్థుతానికి ఒకర్ని అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 24.5 లక్షలు నగదు, రెండు సెల్ ఫోన్లు, రెండు ల్యాప్ టాప్స్, XUV 700 కారు, 16 గ్రాములు బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఇచ్చిన సమాచారంతో ఇతర సభ్యుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.