తిరుపతిలో తొక్కిసలాటపై న్యాయ విచారణ..మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం : చంద్రబాబు 

  • బాధితులందరికీ ఇయ్యాల వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని వెల్లడి 
  • అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఏపీ సీఎం ఆగ్రహం  
  • డీఎస్పీ, గోశాల డైరెక్టర్ సస్పెన్షన్.. ఎస్పీ, జేఈవో, సీఎస్ వో బదిలీ

హైదరాబాద్, వెలుగు : తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణకు ఆదేశిస్తున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. ‘‘ఇలాంటి సమయాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలి. కానీ కొందరు బాధ్యతారాహిత్యంగా ఉన్నట్టు కనిపిస్తున్నది. డీఎస్పీ రమణ కుమార్, గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నాం. ఎస్పీ సుబ్బారాయుడు, టీటీడీ జేఈవో గౌతమి, టీటీడీ సీఎస్‌వో శ్రీధర్‌ను బదిలీ చేస్తున్నాం. ఈ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశిస్తున్నాం” అని వెల్లడించారు. 

తిరుపతిలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని గురువారం చంద్రబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవో, కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఎందుకు జరిగిందో చెప్పాలని ప్రశ్నించారు. అక్కడి నుంచి స్విమ్స్, పద్మావతి ఆసుపత్రులకు వెళ్లి ట్రీట్ మెంట్ పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఆ తర్వాత టీటీడీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ లో చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలారావు, ఇతర అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో చంద్రబాబు మాట్లాడారు. 

గాయపడినోళ్లకు ఆర్థిక సాయం.. 

తొక్కిసలాట ఘటన తనను ఎంతగానో కలచివేసిందని చంద్రబాబు అన్నారు. ‘‘తిరుమల కొండపై ఇంతటి విషాదం జరగడం నన్ను ఎంతగానో బాధిస్తున్నది. తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు ప్రాణాలు విడిచారు. లావణ్య(విశాఖ), శాంతి(విశాఖ), నాయుడు బాబు(నర్సీపట్నం), రజనీ(విశాఖ),  నిర్మల (కోయంబత్తూర్), మల్లిక(మెట్టు సేలం) మరణించారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం అందిస్తాం. కుటుంబసభ్యుల్లో ఒకరికి కాంట్రాక్ట్ ఉద్యోగం ఇస్తాం. తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరికి రూ.5 లక్షల చొప్పున, గాయాలైన మరో 33 మందికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తాం. వాళ్ల ట్రీట్ మెంట్ ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది. వీళ్లందరికీ శుక్రవారం వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తాం.

అనంతరం రవాణా ఖర్చులు భరించి ఇంటికి చేరుస్తాం” అని తెలిపారు. “తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనానికి ఎప్పుడూ లేని టోకెన్ల సంప్రదాయాన్ని గతంలో తెచ్చారు. మొదటి నుంచి ఉన్న సంప్రదాయాలను మార్చడం సరికాదు. ఆగమ శాస్త్ర ప్రకారం ఆలయ పద్ధతులు ఉండాలి. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో అపచారాలు జరగకుండా చర్యలు చేపడతాం. పర్వదినాల్లో శ్రీవారి దర్శనం చేసుకోవాలని భక్తులు బలంగా కోరుకుంటారు. వాళ్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం చేయించే బాధ్యత టీటీడీపై ఉంది’’ అని అన్నారు. 

జరిగిన దానికి క్షమించండి : డిప్యూటీ సీఎం పవన్  

తిరుపతిలో తప్పు జరిగిందని, అందుకు ప్రజలు క్షమించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోరారు. తొక్కిసలాట ఘటనలో మృతి చెందినోళ్ల ఇండ్లకు వెళ్లి కుటుంబసభ్యులకు క్షమాపణ చెప్పాలని టీటీడీ పాలక మండలి సభ్యులకు సూచించారు. టీటీడీలో ప్రక్షాళన చేస్తామని, ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని గురువారం పవన్ పరిశీలించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో శ్యామలరావు, జేఈవో, ఇతర అధికారులపై సీరియస్ అయ్యారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వం నిందలు మోయాల్సి వస్తున్నదని ఫైర్ అయ్యారు.

అనంతరం హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ పొందుతున్న బాధితులను పరామర్శించారు. కాగా, తొక్కిసలాటలో గాయపడినోళ్లను వైసీపీ చీఫ్ జగన్ పరామర్శించారు. ఈ ఘటనకు సీఎం చంద్రబాబు, ఈవో, జేఈవో, టీటీడీ చైర్మన్, కలెక్టర్, ఎస్పీ బాధ్యత వహించాలన్నారు. బాధిత కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్ చేశారు.