తిరుపతి దుర్ఘటన.. బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం

తిరుపతి: తిరుపతిలో వైకుంఠ ద్వార సర్వ దర్శనం టోకెన్ల కోసం భక్తులు భారీగా తరలిరావడంతో తొక్కిసలాట జరిగి ఆరుగురు దుర్మరణం పాలైన ఘటనలో ఏపీ ప్రభుత్వం బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. ఈ దుర్ఘటన జరిగిన తీరుపై నేరుగా సమీక్షించేందుకు ముగ్గురు మంత్రులు తిరుపతికి వెళ్లారు.

వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల కోసం భక్తులు భారీగా తరలిరావడంతో బుధవారం తోపులాట చోటుచేసుకుంది. అది కాస్తా తొక్కిసలాటకు దారితీసింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, దాదాపు 40 మంది అస్వస్థతకు గురయ్యారు. చనిపోయినోళ్లలో ఐదుగురు మగవాళ్లు, ఒక మహిళ ఉన్నారు. అస్వస్థతకు గురైన వాళ్లలో 20 మంది రుయా ఆస్పత్రిలో, మరో 9 మంది స్విమ్స్ ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ పొందుతున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. 

తిరుపతి ఘటనకు సంబంధించి అసలేం జరిగిందంటే..
వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్లను తిరుపతిలోని 9 కేంద్రాల్లో ఏర్పాటు చేసిన 94 కౌంటర్ల ద్వారా జారీ చేస్తామని టీటీడీ ఇటీవల ప్రకటించింది. ఈ నెల 10,11,12 తేదీల్లో దర్శనానికి సంబంధించి లక్షా 20 వేల టోకెన్లను గురువారం ఉదయం 5 గంటల నుంచి జారీ చేస్తామని తెలిపింది. ఈ క్రమంలో బుధవారం సాయంత్రానికే భక్తులు భారీ సంఖ్యలో తిరుపతికి చేరుకున్నారు.శ్రీనివాసం, సత్యనారాయణపురం బైరాగిపట్టెడ రామానాయుడు స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన కేంద్రాలకు భక్తులు పోటెత్తారు.

ఈ క్రమంలో భక్తులు రోడ్లపై గుమిగూడకుండా బైరాగిపట్టెడ వద్ద ఉన్న పద్మావతి పార్కులో ఉంచారు. అయితే అక్కడున్న టోకెన్ల జారీ కేంద్రంలో సిబ్బంది ఒకరు అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించేందుకు గేట్ ఓపెన్ చేశారు. దీంతో టోకెన్లు ఇచ్చేందుకే గేట్ ఓపెన్ చేశారని అనుకున్న భక్తులు.. ఒక్కసారిగా క్యూలైన్ వద్దకు దూసుకొచ్చారు. ఇది కాస్తా తోపులాట, తొక్కిసలాటకు దారితీసింది.