ప్రతి భక్తుడికీ లడ్డూ ఫ్రీ

ప్రతి భక్తుడికీ లడ్డూ ఫ్రీ

తిరుమల, వెలుగు: న్యూ ఇయర్ సందర్భంగా శ్రీవారి భక్తులకు టీటీడీ తీపి కానుకను ప్రకటించింది. తిరుమల శ్రీవారిని దర్శించుకునే ప్రతి భక్తుడికి ఉచితంగా ఒక లడ్డూ ఇస్తామని చెప్పింది. అదనంగా లడ్డూలు కావాలంటే ఎలాంటి సిఫార్సు లేఖలు లేకుండానే కౌంటర్ లో నేరుగా కొనుగోలు చేసే సౌలభ్యాన్ని కల్పిస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఈ మేరకు టీటీడీ నెలకు 24 లక్షల లడ్డూలను భక్తులకు ఫ్రీగా పంపిణీ చేయనుంది. వైకుంఠ ఏకాదశి నుంచి కొత్త విధానం అమలులోకి తీసుకొచ్చేందుకు టీటీడీ సిద్ధమవుతోంది.

5 గంటలపాటు తిరుమంజనం

తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది.  ఆలయ సంప్రదాయం ప్రకారం బ్రహ్మోత్సవాలు, ఉగాది, ఆణివార ఆస్థానం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితి. ఈ నెల 6న వైకుంఠ ఏకాదశి, 7న ద్వాదశి పర్వదినాల నేపథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ప్రసాదాల పోటు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పుతోపాటు పూజాసామగ్రిని ఉదయం 6 నుండి ఉదయం 11 గంటల వరకు శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాల తర్వాత భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.