ఘనంగా నారసింహుడికి పూజలు

  • ఘనంగా నారసింహుడికి  పూజలు
  • స్వామి వారి నగలను తనిఖీ చేసిన ఆఫీసర్లు

యాదాద్రి, వెలుగు:   ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా యాదగిరి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో  తిరుప్పావై వేడుకలు శనివారం  వైభవంగా సాగాయి. ఉత్తర ఈశాన్య ప్రాకార మండపంలో ఆండాళ్​అమ్మవారిని పురోహితులు ప్రత్యేక వేదికపై దివ్య మనోహరంగా తీర్చిదిద్దారు. అర్చక బృందం తిరుప్పావై పాశుర పఠనం చేసి కట్టె పొంగలి ప్రసాదాలను అమ్మవారికి నివేదించారు. మహిళా భక్తులు అమ్మవారికి మంగళహారతులు ఇచ్చారు.  పాతగుట్ట ఆలయంలోనూ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సుప్రభాతంతో నారసింహుడిని మేల్కొలిపి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అష్టభుజి ప్రాకార మండపంలో విశ్వక్సేనుడికి తొలి పూజలతో సుదర్శన నారసింహ హోమం, నిత్య తిరు కల్యాణోత్సవాలను నిర్వహించారు.  

స్వామివారిని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందగౌడ్  దర్శించుకున్నారు. ఆయనకు ఆర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం తెలిపారు.  అనంతరం అర్చకులు స్వామివారి అభిషేకం లడ్డూ ప్రసాదాలను అందజేశారు. స్వామివారి ఆభరణాలను ఎండోమెంట్​జ్యువెలరీ వెరిఫికేషన్ ఆఫీసర్ శేఖర్ పరిశీలించారు. ఆయన యాదగిరి క్షేత్రాన్ని సందర్శించి ప్రధానాలయ ముఖమండపంలోని ఉపాలయాల వెండి తొడుగులను, ఆభరణాలను, అనుబంధ పాతగుట్ట ఆలయంలోని స్వామివారి ఆభరణాలను తనిఖీ చేసి వివరాలు నమోదు చేసుకున్నట్లు ఆఫీసర్లు తెలిపారు. ఈవో గీతారెడ్డి, డిఫ్యూటీ ఈవో దోర్బల భాస్కరశర్మ, ఏఈవోలు, సిబ్బంది ఉన్నారు.