తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యమా? ఓ కుటుంబ ప్రయోజనాలు ముఖ్యమా?

 తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యమా? ఓ కుటుంబ ప్రయోజనాలు ముఖ్యమా?

తెలంగాణ మేధావులుగా చెప్పుకుంటున్నవారికి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, తెలంగాణ ప్రజల ప్రయోజనాలు ముఖ్యమా లేక కేసీఆర్, ఆయన కుటుంబ ప్రయోజనాల ముఖ్యమా? అని తెలంగాణ జాయింట్ యాక్షన్​ కమిటీ (టీజేఏసీ) తరఫున బహిరంగంగా ప్రశ్నిస్తున్నాం.  తెలంగాణ ఆత్మ గౌరవాన్ని, అస్తిత్వాన్ని,  ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ పోరాటాన్ని ప్రశ్నించే గొంతులను పదేండ్లపాటు కాలరాస్తే మేధావులు ఎందుకు నోరు మెదపలేదు.  తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని గత బీఆర్​ఎస్​ పాలకులను ఎందుకు ప్రశ్నించలేదు.  

గత పదేండ్లలో కేసీఆర్​ సారథ్యంలోని బీఆర్ఎస్​ సర్కారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రభుత్వ పక్షాన రాజధాని హైదరాబాద్​లో పెట్టకుంటే.. మీరు ఎందుకు నోరు మెదపలేదు. తెలంగాణ సచివాలయం లోపల, బయట, అసెంబ్లీలో, ప్రగతి భవన్​ అనే గడీ లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని కేసీఆర్​ను ఈ మేధావులు ఎందుకు ప్రశ్నించలేదు. తెలంగాణ ఉద్యమంలో టీజీ అని వాడి.. అనంతరం ఒక పార్టీ ప్రయోజనాల కోసం రాష్ట్రం ఏర్పడిన తరువాత టీఎస్​ అని పెడితే మీ నోళ్లు ఎందుకు మూతపడ్డాయి. తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతం చేయకుండా గొంతు నొక్కితే ఎందుకు ప్రశ్నించలేదు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్​ను కలవడానికి వెళితే ప్రగతి భవన్​ దగ్గర మండుటెండలో ప్రజా గాయకుడు గద్దర్​ను గంటల తరబడి నిలబెట్టినప్పుడు ఈ మేధావులు ఎక్కడికి పోయారు. 

తెలంగాణ ద్రోహులకు పదవులు

తెలంగాణ జేఏసీ చైర్మన్​గా ముందుండి రాష్ట్రం ఏర్పాటయ్యేవరకు పోరాడిన ప్రొఫెసర్​ కోదండరాం ఇంటి తలుపులు బద్దలుకొట్టి పోలీసులు అరెస్టు చేస్తే మీ గొంతులు ఎందుకు పెగలలేదు. ఉద్యమకారులను ఉరికించి కట్టెలతో తరిమికొట్టినవారికి, తెలంగాణ ద్రోహులకు పదవులు ఇస్తే  మీ నిరసన గళమెత్తకుండా.. మీ పెదవులు ఎందుకు మూసుకున్నాయి. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్​ జయశంకర్​సార్​కు  సముచిత గౌరవం ఇవ్వకపోతే మీరందరూ ఎందుకు మాట్లాడలేదు. ఏ పదవులు ఆశించి మీరు ఇంతకాలం నోరు మెదపలేదు.  ప్రజలు తిరస్కరించినవారికి అధికారం పోతే మీకు ఎందుకు బాధ కలుగుతోంది. ప్రజాతీర్పు మేరకు  కేసీఆర్​కు అధికారం లేకపోతేనే మేధావులకు మాటలు వస్తాయా.  భారతదేశంలో మొట్టమొదటిసారిగా టెక్నాలజీని ప్రోత్సహించింది మాజీ ప్రధాని, స్వర్గీయ రాజీవ్​గాంధీ అన్న విషయాన్ని మీరు ఎందుకు విస్మరించారు. 

ప్రత్యేక తెలంగాణ కల సాకారం చేసిన సోనియా గాంధీ

 తెలంగాణ ప్రజల సుదీర్ఘ కల సాకారం చేసిన ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్​అధినేత్రి  సోనియాగాంధీ. ఆమె భర్త, మాజీ ప్రధానమంత్రి దివంగత రాజీవ్​గాంధీ విగ్రహాన్ని తెలంగాణ సచివాలయం ఎదుటపెడితే.. తాము అధికారంలోకి వచ్చాక  రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూల్చివేస్తామని సంఘ విద్రోహుల తీరుగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం. కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చించి చేపట్టిన ప్రాజెక్టులను అవినీతితో నాసిరకంగా నిర్మించినప్పుడు, నాణ్యతలేని కలెక్టరేట్లు నిర్మించినప్పుడు, విద్యా ఉద్యోగ సమస్యలపై గత ప్రభుత్వం నిర్లక్ష్యం చూపినప్పడు ఈ మేధావులు గొంతులు ఎందుకు మూగబోయాయి. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్​ పార్టీని, రైతులకు రుణమాఫీ చేసిన పార్టీని విమర్శించడం, ఒక మాజీ ప్రధాని విగ్రహాన్ని పెట్టడంపై  ఆక్షేపణ తెలుపుతున్న ఆ కొందరు మేధావులు ఆత్మ విమర్శ చేసుకోవాలి. 

- ప్రొ. ​ఇటికాల పురుషోత్తం,
చైర్మన్, తెలంగాణ జాయింట్
యాక్షన్​ కమిటీ (టీజేఏసీ),
తెలంగాణ బహుజన సంఘాలు