- బీఆర్ఎస్ అవినీతి పాలనకు ముగింపు పలకాలి
- పార్టీ ఆఫీసులో టీజేఎస్ ఆవిర్భావ వేడుకలు
హైదరాబాద్, వెలుగు: “సీఎం కుటుంబం, మంత్రులు, ఎమ్మెల్యేలు కబ్జాలకు, సెటిల్మెంట్లకు తెగబడ్డారు. వెల్ఫేర్ స్కీమ్లను కూడా వదలడం లేదు. దళిత బంధు లబ్ధిదారుల దగ్గర ఎమ్మెల్యేలు రూ.3 లక్షల కమీషన్ తీసుకుంటున్నరని స్వయంగా సీఏం కేసీఆర్ ప్రకటించడం సిగ్గుచేటు. కేసీఆర్ ప్రభుత్వంలో అన్ని స్కీముల్లో 30 శాతం కమీషన్ వసూలు జరుగుతున్నది అనడానికి ఇదే నిదర్శనం” అని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు.
శనివారం తెలంగాణ జనసమితి (టీజేఎస్) 5వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ ఆఫీసులో ఆయన జెండా ఆవిష్కరించి మాట్లాడారు. వేలాది మంది త్యాగాలతో ఏర్పడిన రాష్ట్రంలో సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు. ఈ అవినీతి పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. ఆర్భాటంగా ప్రచారాలు చేస్తున్నదే తప్ప రాష్ట్రంలో ఎక్కడా నిర్మాణాత్మక అభివృద్ధి జరగడం లేదని విమర్శించారు. అందుకే టీజేఏస్ పార్టీ ఈ అవినీతి పాలనకు వ్యతిరేకంగా పోరాడుతుందన్నారు.
ఈ క్రమంలో అనేక నిర్బంధాలను కూడా ఎదుర్కొన్నామని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కమీషన్ల రూపంలో జరిగిన అవినీతిని, రైతు సమస్యలు, నిరుద్యోగ సమస్యలు, ఫీజు రీయంబర్స్మెంట్ విడుదల కోసం, సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో నాణ్యమైన భోజనం కోసం ఇలా అనేక సమస్యల మీద పోరాటాలు నిర్వహించామని పేర్కొన్నారు. అంతిమంగా తెలంగాణ బచావో పేరు మీద ఉద్యమకారులతో కలిసి ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీజేఏస్ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.