ఆవిర్భావ వేడుకల్లో మొదటిసారి ఉద్యమకారులకు భాగస్వామ్యం: కోదండరాం

ఆవిర్భావ వేడుకల్లో మొదటిసారి ఉద్యమకారులకు భాగస్వామ్యం: కోదండరాం
  •     వాళ్లను గత సర్కారు ఏనాడూ పట్టించుకోలే
  •     రాష్ట్ర ప్రజల జీవితం ప్రతిబింబించేలా చిహ్నం ఉండాలి
  •      పాట రాసింది ఎవరు అనేదే ముఖ్యం: కోదండరాం

హైదరాబాద్, వెలుగు: ఇప్పుడున్న రాష్ట్ర చిహ్నం మార్చాలని తాను కోరుకుంటున్నట్లు టీజేఎస్​ చీఫ్  ప్రొఫెసర్​ కోదండరాం తెలిపారు. ఇప్పుడున్న చిహ్నంలో తెలంగాణ ప్రజల జీవితం ప్రతిబింబించడం లేదని అన్నారు. అమరుల త్యాగాలు రాష్ట్ర చిహ్నంలో ప్రతిబింబించాలి కదా అని పేర్కొన్నారు. ‘‘రాష్ట్ర చిహ్నంపై గత సర్కార్ చర్చ జరిపి ఉంటే సమస్య ఉండేది కాదు. గత సర్కార్ ఉద్యమకారులను పట్టించుకోలేదు.. ఏనాడూ ఆవిర్భావ వేడుకలకు  పిలిచిందీ లేదు” అని ఆయన అన్నారు. ఇప్పుడు తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల్లో మొదటిసారిగా ఉద్యమకారులకు భాగస్వామ్యం దొరుకుతున్నదని, ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన వారి పేర్లను సీఎం రేవంత్ రెడ్డికి ఇచ్చామని చెప్పారు. ఇంకా కొందరు ఉద్యమకారుల పేర్లను శుక్రవారం ఇస్తామన్నారు. ఉద్యమకారులందరినీ వేడుకలకు ఆహ్వానిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు. గురువారం సీఎం రేవంత్​రెడ్డితో సమావేశం అనంతరం సెక్రటేరియెట్​లోని మీడియా పాయింట్‌‌లో కోదండరాం మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకారులు కోరుకున్న రాష్ట్ర గీతాన్ని, చిహ్నాన్ని ప్రభుత్వం తీసుకువస్తున్నదని తెలిపారు. జయ జయహే తెలంగాణ పాట కొత్తగా రాసింది కాదని.. గత 25 ఏండ్లుగా పాడుకుంటున్నదేనని అన్నారు. ‘‘పాట రాసింది ఎవరు అనేది ముఖ్యం. పాడింది అనేది కాదు. రాష్ట్ర గీతం గొప్పగా రావాలనే సంగీత దర్శకుడు కీరవాణికి అవకాశం ఇచ్చారు. జూన్ 2 రాష్ట్ర గీతాన్ని ప్రభుత్వం విడుదల చేస్తుంది.. ఉద్యమకారులు కోరుకున్నట్లుగానే రాష్ట్ర గీతాన్ని ప్రభుత్వం గుర్తించింది” అని ఆయన పేర్కొన్నారు. 

నాడు అభ్యంతరాలు ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి

రాష్ట్ర చిహ్నంపై గత ప్రభుత్వం చర్చ జరిపి ఉంటే బాగుండేదని, ఆ రోజు చిహ్నంపై అభ్యంతరాలు ఉన్నా ఏమి చేయలేని పరిస్థితి ఉందని కోదండరాం అన్నారు. ‘‘ప్రజల జీవన విధానం, తెలంగాణ సంస్కృతి, ఉద్యమ పోరాటం  ప్రతిబించించే విధంగా ఉండాలి. ఆనాడు మార్పులు చేర్పులు చేయాలని ఉన్నా జరగలేదు. లోగో మారిస్తేనే బాగుంటుందని నా అభిప్రాయం. కట్టడాలు మాత్రమే చిహ్నం కాదు..  కొత్త లోగోలో కూడా కట్టడాలు ఉంటాయని అనుకుంటున్న.  చత్తీస్‌‌గఢ్​ లోగోలో కూడా కట్టడాలు ఉన్నాయి” అని ఆయన తెలిపారు.