- రౌండ్ టేబుల్ సమావేశంలో కోదండరాం
హైదరాబాద్, వెలుగు: మాతృభూమి కోసం ఏండ్లుగా పోరాడుతున్న పాలస్తీనాకు భారత్ అండగా నిలవాలని టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ‘కాల్పుల విరమణ– పాలస్తీనాకు స్వాతంత్ర్యం’ అనే అంశంపై శనివారం నాంపల్లిలోని టీజేఏస్ ఆఫీసులో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలస్తీనా భూభాగాన్ని ఇజ్రాయెల్ 1948 నుంచీ ఆక్రమించేందుకు ప్రయత్నిస్తోందని, తమ మాతృభూమిని కాపాడుకునేందుకు పాలస్తీనియన్లు పోరాటం చేస్తున్నారని చెప్పారు.
నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ హయాం వరకు మన దేశం పాలస్తీనాకు పూర్తి సంఘీభావం ప్రకటించిందని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 51 ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రపంచ శాంతి కోసం కూడా కృషి చేయాలని ఆయన కోరారు. మానవత్వంతో ఆలోచించి ఇజ్రాయెల్ దురాక్రమణను వ్యతిరేకించాలన్నారు. మూవ్‌మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ అధ్యక్షుడు అజీజ్ మాట్లాడుతూ.. పాలస్తీనాపై ఇజ్రాయెల్ గత పది నెలలుగా దాడులు చేస్తోందని.. ఇది యుద్ధం కాదని మన కండ్ల ముందే జరుగుతున్న మారణహోమమని అన్నారు.
ఈ నరమేధంలో ఇప్పటివరకూ లక్షన్నరకుపైగా మంది మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. నిజాం కాలేజీ లెక్చరర్ డాక్టర్ జానకి రెడ్డి మాట్లాడుతూ.. ఇది రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కాదని, పాలస్తీనా ప్రజలు తమ మాతృభూమి కోసం చేస్తున్న సంఘర్షణ అని అన్నారు. ఐక్యరాజ్యసమితి సైతం అమెరికా చేతిలో కీలుబొమ్మగా మారిందని, అందుకే పాలస్తీనాకు భారత్ సంఘీభావం ప్రకటించాలని ఆమె కోరారు.