ఉన్నత విద్యలో సంస్కరణల కోసం కమిషన్​

  • టీజేఎస్​చీఫ్, ప్రొఫెసర్​ కోదండరామ్​
  • రాష్ట్రాల బడ్జెట్​లో వర్సిటీలకు 2 శాతానికి మించి కేటాయించట్లే 
  • ఉన్నత విద్యామండలి చైర్మన్​ఆర్​.లింబాద్రి 
  • ప్రభుత్వాలు మారుతున్నా  విద్యకు బడ్జెట్ ​పెరగట్లే 
  •  ప్రొఫెసర్ ​హరగోపాల్​ 

హనుమకొండ, వెలుగు : గత బీఆర్ఎస్​ ప్రభుత్వం యూనివర్సిటీలను నిర్వీర్యం చేసిందని టీజేఎస్ ​చీఫ్, ప్రొఫెసర్​ కోదండరామ్​ అన్నారు. ఉన్నత విద్యలో సంస్కరణల కోసం రాష్ట్ర ప్రభుత్వం తొందర్లోనే కమిషన్ వేయబోతుందని స్పష్టం చేశారు. కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్(కుర్తా) ఆధ్వర్యంలో  ‘తెలంగాణలో ఉన్నత విద్య ప్రస్తుత పరిస్థితులు--..బలోపేతం చేయడానికి అనుసరించాల్సిన విధానాలు’ అనే అంశంపై క్యాంపస్​లోని సెనేట్​హాలులో సోమవారం సదస్సు నిర్వహించారు. 

దీనికి ముఖ్య అతిథిగా హాజరైన కోదండరామ్​మాట్లాడుతూ రాష్ట్రంలో యూనివర్సిటీలను కాంట్రాక్టు, పార్ట్​ టైం, గెస్ట్​ ఫ్యాకల్టీలతోనే నడుపుతున్నారని, రెగ్యులర్​పద్ధతిలో రిక్రూట్​మెంట్ జరగాల్సిన అవసరం ఉందన్నారు.  పదేండ్లలో అసలు రిక్రూట్​మెంట్స్​జరగలేదని, గత బీఆర్​ఎస్​ ప్రభుత్వ హయాంలోనే ప్రైవేటు వర్సిటీలు పుట్టుకొచ్చాయన్నారు. యూనివర్శిటీకి వచ్చే నిధులు జీతాలకే సరిపోని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. వర్సిటీల్లో ఖాళీలను భర్తీ చేయడంతో పాటు కావాల్సిన నిధులు సమకూర్చి, పరిశోధనలను పునరుద్ధరించాలన్నారు. 

ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆర్.లింబాద్రి మాట్లాడుతూ రాష్ట్రాల బడ్జెట్​లో వర్సిటీలకు 2 శాతానికి మించి కేటాయించడం లేదన్నారు. విద్యార్థుల చదువుల్లో ప్రభుత్వ వ్యయం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. సెంట్రల్​యూనివర్సిటీ రిటైర్డ్​ ప్రొఫెసర్​హరగోపాల్​మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్నా విద్యకు మాత్రం బడ్జెట్​ పెరగడం లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, బలహీన వర్గాలు విద్యకు దూరం అవుతున్నాయన్నారు. కేంద్రం యూజీసీకి ఇచ్చే నిధులను 6 వేల కోట్ల నుంచి 2 వేల కోట్లకు తగ్గించిందని, పరిశోధనలు, ప్రాజెక్టులకు నిధుల కొరత సమస్యగా మారిందన్నారు.

 విద్య అందించాలనే సామాజిక బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకున్నాక ప్రైవేట్ వ్యక్తులు ‌‌‌‌ఎంటర్ అవుతున్నారని చెప్పారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి లాంటోళ్లు ఎడ్యుకేషన్ పాలసీలను ప్రభావితం చేస్తున్నారని విమర్శించారు.  కేయూ వీసీ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్, తెలంగాణ అకాడమీ ఆఫ్​సైన్స్​అధ్యక్షుడు డాక్టర్​ సీహెచ్​.మోహన్​ రావు, ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్​ టి.పాపిరెడ్డి పాల్గొన్నారు.