నెట్వర్క్, వెలుగు: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పాలని టీజేఎస్ గ్రేటర్ అధ్యక్షుడు నర్సయ్య, పార్టీ నేత సర్దార్ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. నాంపల్లిలోని టీజేఎస్ ఆఫీస్ ముందు గురువారం అమిత్‌షా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ముషీరాబాద్‌లో మాదిగ మేధావుల ఫోరం అధ్యక్షుడు డాక్టర్ ఆరేపల్లి రాజేందర్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అరవింద్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో వేర్వేరుగా నిరసనలు చేశారు.
మంత్రివర్గం నుంచి అమిత్ షాను వెంటనే తప్పించాలన్నారు. బన్సీలాల్‌పేటలోని జబ్బర్ కాంప్లెక్స్ వద్ద నిరసన చేస్తున్న కాంగ్రెస్ నాయకులను గాంధీనగర్ పోలీసులు అదుపులోకి తీసుకొని పీఎస్‌కు తరలించారు. ఓయూలో ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ర్యాలీగా వెళ్లి క్యాంపస్‌లోని లా కాలేజీలో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని పాలతో శుద్ధి చేశారు. ఎల్బీనగర్లో నిర్వహించిన నిరసనలో తెలంగాణ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.