టీఆర్ఎస్ అసమర్ధ పాలనకు పెంచిన విద్యుత్ చార్జీలే నిదర్శనమని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేయడంవల్లే ప్రజలపై చార్జీల భారం పడుతోందని ఆయన అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం కోదండరాం ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించారు. సూర్యపేట అభ్యర్థిగా కుంట్ల ధర్మార్జున్ రెడ్డి, హుజూర్ నగర్ అభ్యర్థిగా దొంతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పేర్లను ఖరారు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటనలో ఉన్న కోదండరాం.. మీడియాతో మాట్లాడారు.
‘డిస్కం కంపెలనీలకు కట్టాల్సిన బకాయిలు ప్రభుత్వం కడితే.. ఆ కంపెనీలకు నష్టాలుండవు. ప్రభుత్వ అవివేక విధానాల వల్లే డిస్కంలకు నష్టాలు వస్తున్నాయి. ప్రభుత్వ అసమర్ధతకు పెంచిన విద్యుత్ చార్జీలే నిదర్శనం. ధాన్యం కొనుగోళ్ళ విషయంలో కేంద్రాన్ని ఒప్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఎన్నికల్లో వేదజల్లిన డబ్బులను తిరిగి సంపాదించడం కోసం పాలకులు అధికారాన్ని వాడుకుంటున్నారు. ప్రజాసంక్షేమం కోసం పాటుపడాల్సిన పాలకులు.. డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో అసమర్థ పాలన రాజ్యమేలుతోంది. ప్రజలకు ఎంగిలి మెతుకులు వేసి.. అధికారంలోకి వచ్చి కోట్లు దండుకుంటున్నారు. ప్రజల సంక్షేమం పట్టని రాజకీయాలను తిరస్కరించాలి. అన్ని కోణాల్లో ప్రజల పురోగతికి ఆటంకంగా మారిన ఈ ప్రభుత్వాన్ని మార్చాల్సిందే. రాజకీయాల్లో మార్పు కోసం వస్తున్న తెలంగాణా జన సమితిని ప్రజలందరూ ఆదరించాలి’ అని కోదండరాం పిలుపునిచ్చారు.
For More News..