ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఇబ్రహీంపట్నం, వెలుగు: మండల కేంద్రం, వర్షకొండ గ్రామాల మధ్య హైలెవల్ బ్రిడ్జిని నిర్మించాలని కోరుతూ టీజేఎస్ నాయకులు మంగళవారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా రెండు గ్రామాల మధ్యగల లో లెవల్​ బ్రిడ్జిని రైతులతో కలిసి పరిశీలించి నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ వర్షాలు కురిసినప్పుడు లోలెవల్​ బ్రిడ్జిపై నుంచి వరదనీరు భారీగా ప్రవహిస్తోందని ఫలితంగా రాకపోకలు నిలిచిపోయి ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అనంతరం తహసీల్దార్ మహేశ్వర్ కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు రమేశ్, శంకర్, ప్రవీణ్, మోజెస్, గంగారెడ్డి, రాజేందర్​ తదితరులున్నారు.  

పేదోళ్ల ఆనందమే టీఆర్ఎస్ ​లక్ష్యం

జమ్మికుంట, వెలుగు : ప్రతి ఇంటికి సంక్షేమం, పేదోడి ముఖంలో ఆనందమే సీఎం కేసీఆర్ లక్షమని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. మంగళవారం మున్సిపల్ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వర్​రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జమ్మికుంట పట్టణ, మండల పరిధిలో మంజూరైన ఆసరా పింఛన్లను ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ జమ్మికుంటలో 4,009 ఆసరా పింఛన్లు ఉండగా కొత్తగా 802 పింఛన్లు, 55 కల్యాణ లక్ష్మి చెక్కులు మంజూరైనట్లు తెలిపారు. సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాయన్నారు. అనంతరం పింఛన్లు పొందిన లబ్ధిదారులు, వృద్ధులు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, తహసీల్దార్ రాజేశ్వరి, జెడ్పీటీసీ శ్రీరాంశ్యామ్, ఎంపీడీఓ, సహకార సంఘం చైర్మన్ సంపత్, కమిషనర్  సమ్మయ్య, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, లీడర్లు పాల్గొన్నారు.

ప్రజల కష్టాలు వదిలేసి.. కమీషన్ల కోసం కక్కుర్తి

రామడుగు, వెలుగు: స్థానిక ఎమ్మెల్యే ప్రజల కష్టాలను గాలికి వదిలేసి కమీషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారని మాజీ మంత్రి సుద్దాల దేవయ్య ఆరోపించారు. రామడుగు మండల కేంద్రంలోని నూతన బ్రిడ్జిని త్వరగా ప్రారంభించాలని కోరుతూ బీజేపీ మండలాధ్యక్షులు కరుణాకర్​ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా దేవయ్య మాట్లాడారు. పాత బ్రిడ్జి కూలి రాకపోకలు నిలిచినా పనులు ఎందుకు వేగంగా చేయడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పనులు పూర్తి చేయకపోతే కలెక్టర్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ప్రభాకర్​యాదవ్, విద్యాసాగర్, జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్​గౌడ్, రాంకిషన్, ఎంపీటీసీ రవీందర్ పాల్గొన్నారు.

శక్తి టెంపుల్ ను దర్శించుకున్న ఎంపీలు

కరీంనగర్ టౌన్, వెలుగు: స్థానిక మహాశక్తి టెంపుల్ ను మంగళవారం రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్​, ఎంపీ బండి సంజయ్​దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్​మాట్లాడుతూ ఒకే ప్రాంగణంలో ముగ్గురు దేవతలు కొలువుతీరడం గొప్ప విషయమన్నారు. బండి సంజయ్ కృషితో ఆలయాన్ని నిర్మించడం కరీంనగర్ ప్రజల అదృష్టమన్నారు. కాగా శరన్నవాత్రుల్లో రెండో రోజు బాలాత్రిపురసుందరి దేవి రూపంలో దర్శనమిచ్చారు. అమ్మవారికి108 రకాల నైవేద్యాలు సమర్పించారు. 

రాజన్న ఆలయ ఈఓగా కృష్ణప్రసాద్

వేములవాడ, వెలుగు: స్థానిక రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఈఓగా డి. కృష్ణ ప్రసాద్ నియామకం అయ్యారు. డిప్యూటీ కమిషనర్​గా విధులు నిర్వహించిన ఆయనను వేములవాడ ఆలయ ఈఓగా నియమిస్తూ మంగళవారం అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

పీఆర్టీయూతోనే సమస్యల పరిష్కారం

కరీంనగర్ టౌన్, వెలుగు: రాష్ట్ర ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం పీఆర్టీయుతోనే సాధ్యమవుతాయని టీచర్స్ ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన జిల్లా శాఖ కౌన్సిల్ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ముస్కు తిరుపతి రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. 317 జీఓ ద్వారా ఏర్పడ్డ సమస్యలైన వితంతువులు, మెడికల్ గ్రౌండ్, సీనియర్, జూనియర్ టీచర్స్ సమస్యలన్ని త్వరలో పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా ప్రధానకార్యదర్శి మర్రి జైపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రవీందర్, వెంకటేశ్వర్ రావు, బాల్ రెడ్డి తదితరులు 
పాల్గొన్నారు. 
పోరాట యోధులను గుర్తుంచుకుందాం

సిరిసిల్ల కలెక్టరేట్, వెలుగు: తెలంగాణ పోరాట యోధులు, మహనీయుల గొప్పతనాన్ని గుర్తుంచుకోవాలని,వారి గొప్పతనాన్ని భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకే విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నామని మనిస్టర్​తారకరామారావు అన్నారు. మంగళవారం జిల్లా పర్యటనలో భాగంగా సిరిసిల్లలో రూ.2కోట్ల 29లక్షలతో వెంకంపేట మెయిన్ రోడ్డు విస్తరణపనులకు శంకుస్థాపన చేసి, రూ.13 లక్షలతో నిర్మించిన బస్తీ దవాఖానాను ప్రారంభించారు. అనంతరం సిరిసిల్ల పట్టణం మానేరు నది సమీపంలోని ఎల్లమ్మ గుడి వద్ద ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని మినిస్టర్​ఆవిష్కరించి నివాళులర్పించారు. అనంతరం  ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఆచార్య లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్ర్య ఉద్యమం సహా అనేక పోరాటాలు చేశారని, ఆయన సేవలు మరువలేనివని అన్నారు. సిరిసిల్లలో కొత్త చెరువు ట్యాంక్ బండ్, కొత్త జంక్షన్ల వద్ద మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకుందామని అన్నారు. తెలంగాణ ఏర్పడక ముందు సిరిసిల్లలో నేతన్నల ఆత్మహత్యలను చూసి సీఎం కేసీఆర్ చలించి వారి సంక్షేమం కోసం రూ.50 లక్షలు విరాళాలు సేకరించి ఆర్థిక సహాయం అందజేశారని గుర్తు చేశారు. నేతన్నల అభివృద్ధికి ఇచ్చే రూ.70 కోట్ల బడ్జెట్​ను రూ.1,200 కోట్లకు పెంచామని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, తెలంగాణ మరమగ్గాలు, జౌళి అభివృద్థి కార్పొరేషన్ అధ్యక్షుడు ప్రవీణ్, కలెక్టర్ అనురాగ్ జయంతి, జడ్పీ చైర్ పర్సన్ అరుణ రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్లకే ‘దళిత బంధు’

గోదావరిఖని, వెలుగు : ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌‌‌‌ రామగుండం నియోజకవర్గంలో అర్హులైన నిరుపేద దళితులకు కాకుండా, టీఆర్‌‌‌‌ఎస్ లీడర్లకే దళిత బంధు ఇప్పిస్తున్నారని కాంగ్రెస్‌‌‌‌ పార్టీ నియోజవకర్గ ఇన్​చార్జి ఎంఎస్‌‌‌‌ రాజ్‌‌‌‌ ఠాకూర్‌‌‌‌ ఆరోపించారు. మంగళవారం గోదావరిఖని మార్కండేయకాలనీలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతరం 50 డివిజన్ల అధ్యక్షులకు నియామక పత్రాలు అందజేశారు. కాంగ్రెస్​ఎస్సీ సెల్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ యుగంధర్‌‌‌‌ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో లీడర్లు కాల్వ లింగస్వామి, రవికుమార్, మహేశ్, నజీముద్దీన్, హరిప్రసాద్, విజయ్, ఫజల్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

కరెంట్​ ఇస్తుంది 9 గంటలే

వెల్గటూర్, వెలుగు: టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఇస్తున్నట్లు ఉట్టి మాటలు చెబుతోందని, వాస్తవానికి 9 గంటల కరెంటే ఇస్తోందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం రాజారాంపల్లిలో మంగళవారం నిర్వహించిన పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవంలో  ఆయన మాట్లాడారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ చూపులకే ధర్మరాజుని, చేతల్లో దుర్యోధనుడని అన్నారు. ధర్మపురి రైతాంగాన్ని నిండా ముంచిన ఘనత ఆయనదేనన్నారు. బతుకమ్మ చీరల్లో నాణ్యత లేదని, మహిళలు కట్టుకోవడానికి కాకుండా కూరగాయల తోటల చుట్టూ కడుతున్నారని ఆరోపించారు. కార్యక్రమం లో జగిత్యాల డీసీసీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వెల్గటూర్ మండలాధ్యక్షుడు శైలేందర్ రెడ్డి  పాల్గొన్నారు.