
ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు, విద్యార్థుల ఆత్మహత్యలకు విద్యాశాఖ మంత్రి బాధ్యత తీసుకుని రాజీనామా చేయాలని తెలంగాణ జన సమితి అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. హైదరాబాద్ లోని టీజేఎస్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గ్లోబరినా సంస్థ అన్నీ తప్పిదాలే చేస్తోందన్నారు. అసలు ఆ సంస్థకు ఇంటర్ డేటాను ఎంటర్ చేసే సామర్థ్యం ఉందా అనేది అనుమానంగా ఉందన్నారు. ఓఎంఆర్ షీట్ ఇచ్చినా మార్కులు సరిగా ఎంటర్ చేయలేక పోయిందని విమర్శించారు.
గ్లోబరినా సంస్థపై ఫిర్యాదులు వచ్చినా సీఎస్ స్పందించలేదన్నారు. ఇంటర్ బోర్డు, టీ-సర్కార్ తప్పుడు సమాచారం ఇచ్చి హైకోర్టును తప్పుదారి పట్టించారని విమర్శించారు. ఈ విషయంపై భవిష్యత్ లో మరిన్ని ఆందోళనా కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఇంటర్ బోర్టు తీరుపై అఖిలపక్షంగా గవర్నర్ ను కలుస్తామని కోదండరాం అన్నారు.టీఆర్ఎస్ కు చెందిన ముగ్గురు నేతలే ఈ సమస్యకు బాధ్యులని ఆయన అన్నారు. బాధ్యతల నుండి తప్పించుకునేందుకు ఇంటర్ బోర్డు కార్యాలయాన్ని పోలీస్ స్టేషన్ గా మార్చారని, సమస్యల పరిష్కారం కోసం వస్తున్న విద్యార్ధులను, తల్లిదండ్రులను అరెస్టులు చేస్తున్నారన్నారు.