రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. రాష్ట్రంలో కరోనా పరీక్షలు పెంచాలని, పరీక్షల పూర్తి వివరాలు అందించాలని కోర్టు ఆదేశించినా.. ప్రభుత్వం మిన్నకుండడం సరికాదన్నారు. కరోనా నిర్మూలన కోసం హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి జిల్లా కేంద్రంలో కరోనా చికిత్స అందించాలని, ప్రజారోగ్యం పై ప్రభుత్వం ఇంకా ఎక్కువగా ఖర్చు చేయాలని అన్నారు. జిహెచ్ఎమ్‌సీలో కరోనా కేసులు పెరుగుతుండడంపై ప్రజలు భయపడుతున్నారన్నారు.
కరెంటు కట్ చేస్తామని మంత్రి అనడం సరికాదు
రాష్ట్రంలో కరెంటు బిల్లుల పెరుగుదల ఆవేదనలకు గురిచేస్తోందని కోదండరాం అన్నారు. కరోనా భయంతో లాక్ డౌన్ ఎత్తేసినా.. ఆర్థిక కార్యకలాపాలు ఇంకా పుంజుకోలేదన్నారు. మూడు నెలల బిల్లు ఆవరేజ్ చేసే సరికి శ్లాబులు మారిపోయాయని అన్నారు. బిల్లు కట్టకపోతే కరెంటు కట్ చేస్తామని మంత్రి జగదీశ్ రెడ్డి అనడం సరికాదన్నారు కోదండరాం. 100 యూనిట్ల వరకు ఉపయోగించే వాళ్లకు ప్రభుత్వం ఫ్రీ విద్యుత్ అందించాలని, 200 యూనిట్ల వరకు సగం బిల్లు ఇవ్వాలన్నారు. టెలిస్కోపిక్ విధానాన్ని అమలు చేసి… నాన్ టెలిస్కోపిక్ పద్ధతిని రద్దు చేయాలని చెప్పారు. కనీసం ఈ నాలుగు నెలలైనా ఈ విధానం అమలు చేయాలని ప్రభుత్వాని కోరారు.
కరోనా వైరస్ బారిన పడి మరణించిన జర్నలిస్ట్ మనోజ్ మృతిపై సంతాపం వ్యక్తం చేస్తూ.. అతని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకొవాలన్నారు కోదండరాం.