‘ఎల్ఆర్ఎస్ చట్ట వ్యతిరేకం’

పైసా పైసా పోగేసి ఎప్పటికైనా ఉపయోగపడుతుందన్న ఆశతో ప్లాట్లు కొనుక్కొని, వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటున్న పేద, మధ్య తరగతి ప్రజలకు ఎల్ఆర్ఎస్ స్కీమ్ పిడుగుపాటు లాంటిదే. ఆగస్టు 31న రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 131 ప్రకారం రాష్ట్రంలోని అన్ని లేఅవుట్లు, వాటిలోని ప్లాట్లు అక్రమమైనవి. రెగ్యులరైజ్ చేసుకోకుండా ఈ ప్లాట్లను అమ్మడం, కొనడం నిషేధం. జీవో 131 అమల్లోకి రావడంతో ఇప్పుడున్న ప్లాట్లు ఉన్నా లేని కిందే లెక్క. రెగ్యులరైజేషన్ కోసం కట్టాల్సిన చార్జీలను తగ్గించినప్పటికీ చాలా వరకు ప్లాట్ల ధరకు సమానంగా ఉన్నాయి. గతంలో ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకోవాలనుకునేవాళ్లే అప్లై చేసుకున్నారు. కానీ ఇప్పుడు అందరూ చార్జీలు చెల్లించి రెగ్యులరైజ్ చేసుకోవాల్సిన పరిస్థితులను ప్రభుత్వం కల్పించింది. జీవో 131 ప్రకారం రెగ్యులరైజ్ చేసుకోకపోతే ప్లాట్లను అమ్ముకోవడం వీలు కాదని, తప్పకుండా చేయించుకోవాల్సిందేనని బెదిరిస్తోంది. ఈ రకంగా ప్రభుత్వం ప్రజలను బలవంతం చేయవచ్చునా అన్నదే ప్రశ్న. ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతి ప్రజాస్వామ్య సూత్రాలకు వ్యతిరేకంగా ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 300A మనకు ఇచ్చిన ఆస్తి హక్కుకు జీవో 131 విఘాతం కలిగిస్తోంది. ఆర్టికల్ 300A  ప్రకారం చట్టబద్ధమైన పద్ధతుల్లో తప్ప మరే పద్ధతుల్లో ఆస్తి హక్కుకు ఇబ్బంది కలిగించరాదు.

ప్రభుత్వ వైఖరి సరికాదు..

అనేక ఏండ్లుగా లేఅవుట్లు వేస్తున్నారు. సంబంధిత శాఖలూ వాటిని ఆమోదిస్తున్నాయి. ప్లాట్లను అమ్ముతున్నప్పుడు కూడా ప్రభుత్వం ఎన్నడూ ఆపలేదు. ఎప్పుడూ వేలెత్తి ఏ తప్పును చూపలేదు. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న ప్రభుత్వం.. ఇప్పుడు ఆ లేఅవుట్లన్నీ అక్రమమని చెబుతోంది. కొన్ని ప్లాట్లు అనేక మంది చేతులు మారాయి. కొందరు ప్రహరీలు నిర్మించారు. కరెంటు కనెక్షన్ కూడా తీసుకున్నారు. ఇంకొందరైతే ఇండ్లు కూడా నిర్మించుకున్నారు. ఇన్నేళ్లు ఆమోదించి ఇప్పుడు అకస్మాత్తుగా అన్ని లేఅవుట్లూ అక్రమమని ప్రకటించిన ప్రభుత్వ వైఖరే అనైతికంగా ఉంది. 2015లో రెగ్యులరైజేషన్ కోసం ప్రభుత్వం ఒక జీవో తెచ్చింది. దాని పర్యవసానాలు అంచనా వేయకుండా, ఆ స్కీమ్ పట్టణాభివృద్ధికి ఏ మేరకు దోహదపడిందో అధ్యయనం చేయకుండా ఇంకొక స్కీమ్ తేవడం సమంజసం కాదు. 2018లో తెచ్చిన పంచాయతీ రాజ్ చట్టాన్ని, 2019లో తెచ్చిన మున్సిపల్ చట్టాన్ని అంతకుముందు తేదీల నుంచే అమలు చేయడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం. సహజ న్యాయసూత్రాల ప్రకారం ఏ చట్టమైనా ఆ చట్టం వచ్చిన తేదీ నుంచే అమలవుతుందని గ్రహించాలి. వాటిని దృష్టిలో పెట్టుకొని అంతకుముందు తేదీ నుంచే అమలు చేయాలనుకోవడం రాజ్యాంగ విరుద్ధం.

చార్జీలేం తగ్గలేదు..

లేఅవుట్లలో ఎక్కువ వరకు ప్లాట్లు 200 నుంచి 250 గజాల విస్తీర్ణం ఉంటాయి. ఇప్పుడు ఆ లేఅవుట్ల రోడ్లను విస్తరించే క్రమంలో ప్లాట్ల విస్తీర్ణం తగ్గిపోతుంది. రెండు వైపులా రోడ్లు వుండే ప్లాట్లయితే హక్కుదారులకు ఏమీ మిగలడం లేదు. అయినా వారి నుంచి కూడా మొత్తం ప్లాటు విస్తీర్ణానికి చార్జీలు వసూలు చేస్తున్నారు. పోయిన విస్తీర్ణానికి నష్ట పరిహారం కూడా ఇవ్వడం లేదు. ఫలితంగా ప్లాట్ విలువ కన్నా చెల్లిస్తున్న చార్జీలే ఎక్కువగా ఉన్నాయి. రెగ్యులరైజేషన్ కోసం చెల్లిస్తున్న చార్జీలు.. ప్రభుత్వం సవరించిన తర్వాత కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. 100 చదరపు మీటర్లకు (గజానికి రూ.వెయ్యి రిజిస్ట్రేషన్ విలువ అనుకుంటే) కనీసం రూ.21,000 కట్టక తప్పదు. కరోనా కాలంలో చాలా మందికి ఇది భారమే. అయినా ఈ స్థాయిలో ప్రజల నుంచి వసూలు చేయడం అన్యాయమే. ఏ రీతిలో చూసినా ఈ వసూళ్లు సమర్థనీయం కాదు.

2015 అప్లికేషన్లు పెండింగ్ లోనే..

ప్రభుత్వ ప్రయత్నం పేద, మధ్య తరగతి వర్గాలకు సమస్యలను తెచ్చిపెట్టింది. ఇవ్వాళ అవసరార్థం యజమానులు తమ ప్లాట్ అమ్మలేరు, కుదువపెడదామన్నా ఎవరూ తీసుకునే వారు లేరు. ఉన్న మిగులును భూమి మీద పెట్టి, అవసరానికి అక్కరకు వస్తుందన్న ఆశ అడియాసగా మారిపోయింది. పోనీ ఇప్పటికిప్పుడు రుసుములు కడితే రెగ్యులరైజేషన్ జరుగుతుందన్న నమ్మకం లేదు. 2015లో రెగ్యులరైజేషన్ కోసం ఇచ్చిన అప్లికేషన్లు ఇంకా పెండింగులో ఉన్నాయి. ఇప్పుడు పెట్టుకుంటున్న దరఖాస్తులు ఎప్పటికి పరిష్కారం అవుతాయో తెలియదు.

రియల్ ఎస్టేట్ రంగానికి పెద్ద దెబ్బ..

ప్రభుత్వం తెచ్చిన విధానాలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలైపోయింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో దాదాపు 22 శాతం ఆదాయం ఈ రంగం నుంచి వస్తోంది. రాష్ట్రం ఏర్పడిన నాటికి రియల్ ఎస్టేట్ రంగం వాటా రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 15.6 శాతం. స్వరాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగానికి ప్రాధాన్యం పెరిగింది. ఇలాంటి పరిస్థితిలో ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ ఈ రంగానికి కోలుకోలేని దెబ్బే. మరో కీలక విషయమేమిటంటే ఈ రంగం మీద ఆధారపడి బతుకుతున్న వారు ఎక్కువ భాగం దిగువ మధ్య తరగతికి చెందినవారు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రెండు మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఒకటి రియల్ ఎస్టేట్ రంగం స్వరూపం పూర్తిగా మారి, భూముల ధరలు విపరీతంగా పెరుగుతాయి. దాంతో పేద, మధ్య తరగతి వర్గాలకు ఇకముందు ప్లాట్లు అందుబాటులో ఉండవు. ఇక రెండో పరిణామమేమిటంటే చిన్న వ్యాపారుల చేతుల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం బడా కంపెనీల చేతుల్లోకి చేరుతుంది. అందువల్ల నిరుద్యోగ సమస్య పెరుగుతుంది. సామాజిక-ఆర్థిక అసమానతలు పెరుగుతాయి. ఏ తీరుగ చూసినా ఇది మంచి పరిణామం కాదు. చట్ట వ్యతిరేక పద్ధతుల్లో ఆదాయాన్ని సమకూర్చుకునే క్రమంలో ప్రభుత్వం అనేక అనర్థాలను సృష్టిస్తోందని గమనించాలి.

రాజుల కాలం లెక్క చేస్తున్నది…

ఈ చార్జీల వసూలు కోసం ప్రభుత్వం అక్రమ మార్గాన్ని అనుసరిస్తోంది. రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్లను ఏ పరిస్థితిలోనూ ఆపటానికి వీలులేదు. నిషేధిత ఆస్తులను తప్ప ఇతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ఆపడమంటే రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కును కాలరాయడమే. రిజిస్ట్రేషన్ చట్టం (1908) సెక్షన్ 22-A ప్రకారం నిషేధిత ఆస్తుల జాబితాను తయారు చేయాలి. కానీ ప్రభుత్వం చట్టానికి విరుద్ధంగా రిజిస్త్రేషన్లను నిలిపివేసి, చార్జీలు కంపల్సరీగా చెల్లించాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది. ప్రభుత్వం చట్ట వ్యతిరేక పద్ధతుల్లో ఈ చార్జీలు వసూలు చేస్తున్న తీరు.. పాత కాలంలో రాజులు, చక్రవర్తులు ఎండలో నిలబెట్టి, వీపుల మీద రాళ్లు పెట్టి, బలవంతంగా పన్నులు వసూలు చేసిన పద్ధతిని గుర్తు చేస్తోంది.

అడ్డదారుల్లో ఆదాయం పెంచుకుంటోంది..

ఆదాయం బాగా పడిపోవడంతో డబ్బుల కోసం ప్రభుత్వం ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు కనిపిస్తోంది.  2018-19లో ప్రభుత్వ ఆదాయం రూ.1,56,981 కోట్లు కాగా 2019-20 లో ఆర్థిక మాంద్యం కారణంగా రూ.1,32,508 కోట్లకు పడిపోయింది. ఈ ఏడాది (2020-21)లో జులై నాటికి అంచనా వేసిన స్థూల ఆదాయంలో 16.22 శాతం మాత్రమే సమకూరింది. అంతకు ముందు ఏడాది జులై నాటికి అంచనా వేసిన ఆదాయంలో 25.65 శాతం వసూలైంది. కానీ అంచనా వేసిన రుణాలలో ఎక్కువ శాతాన్ని ప్రభుత్వం మార్కెట్ల నుంచి తీసుకుంది. 2019-20లో బడ్జెట్ లెక్కల ప్రకారం తెచ్చుకోవాలనుకున్న అప్పులో జులై  నాటికి 42.88శాతం తీసుకుంది. అయితే ఈ ఏడాది ఇప్పటికే అనుకున్న రుణాల్లో 62.62శాతం అప్పు తెచ్చుకుంది. ఓవైపు ఆదాయం తగ్గుతోంది. అప్పులు పెరుగుతున్నాయి. అయినా అవసరాలకు తగినట్టుగా డబ్బులు అందడం లేదని, ప్రభుత్వం ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపుతోంది. అడ్డదారుల్లో ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.

For More News..

మనది మార్పును వ్యతిరేకించే దేశం.. అందుకే బిల్లులపై ఇంత గొడవ

8 శాతం మంది.. 60 శాతం మందికి కరోనా అంటించిన్రు

బలరాంపూర్ అత్యాచార బాధితురాలు మృతి