బీజేపీ గెలిస్తే దేశానికి, రాజ్యాంగానికి ప్రమాదం: ప్రొ.కోదండరాం

మెదక్, వెలుగు: భావప్రకటనా స్వేచ్ఛపై కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తోందని టీజేఎస్‌‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌‌ కోదండరాం విమర్శించారు. బుధవారం మెదక్‌‌లో జరిగిన రాజ్యాంగ పరిరక్షణ సదస్సులో ఆయన మాట్లాడారు. కాకతీయ యూనివర్సిటీలో కవులు, రచయితలపై దాడులు చేయడం సరికాదన్నారు. రాజ్యాంగాన్ని మారుస్తామని, సవరణలు చేస్తామని, సంస్కరణలు తీసుకొస్తామని చెబుతున్న బీజేపీకి ఓటేయొద్దని సూచించారు.

అసమానతలను మరింత పెంచడానికే 400 సీట్లు అడుగుతోందన్నారు. పెట్రోల్, డీజిల్‌‌ ధరలు పెంచడంతో సామాన్యులపైన భారం పడుతోందన్నారు. దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా నిరుద్యోగం పెరిగిందన్నారు. వచ్చే పార్లమెంట్‌‌ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే రాజ్యాంగానికి, దేశానికి ప్రమాదం అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌‌ను ఓడించినట్లే, పార్లమెంట్ ఎన్నికల్లో మోడీని ఓడించాలన్నారు.

కార్యక్రమంలో తెలంగాణ పీపుల్స్‌‌ ఫ్రంట్‌‌ కోకన్వీనర్‌‌ కన్నేగంటి రవి, కొండల్‌‌రెడ్డి, పీడీ ఆనందం, నర్సింలు గౌడ్, దయాసాగర్‌‌ పాల్గొన్నారు.