నిజామాబాద్, వెలుగు : ఒళ్లు పెలుసుబారేదాకా సర్కారు సేవలో జీవితాన్ని గడిపిన పెన్షనర్లను భారం అనుకునే రోజులు పోవాలని టీజేఎస్‌అధ్యక్షుడు ప్రొఫెసర్కోదండరాం అన్నారు. పెన్షనర్ల సమస్యలపై పాలకులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. మంగళవారం నిజామాబాద్‌లోని అంబేద్కర్ భవన్లో తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిర్వహించిన కార్యక్రమానికి కోదండరాం హాజరై మాట్లాడారు.
30 ఏండ్లకు మించి ఒక సంస్థకు సేవ చేశాక బయట వేరే పని చేయలేమన్నారు. 2000 సంవత్సరం వరకు చాలీచాలని జీతాలు ఉండేవని, ఇప్పుడు జీతం పెరిగినా పిల్లల చదువు, ఇంటి ఖర్చులకే సరిపోతున్నాయని, సేవింగ్స్అనేది ఉండడం లేదన్నారు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తే తప్ప ఇల్లు గడిచే పరిస్థితి లేదన్నారు. రిటైర్ అయ్యాక గవర్నమెంట్‌పై ఆధార పడొద్దని ప్రభుత్వాలు ఆలోచిస్తున్న తీరు భావ్యంకాదన్నారు.
పాలకులు పెన్షనీర్లకు చేసిన గొప్పమేలు ఇప్పటిదాకా ఏమీ లేదన్నారు. కొత్త పెన్షన్ స్కీమ్ కింద గవర్నమెంట్సామాజిక భద్రత కల్పించాలని, వృద్ధాప్య వసతులు వృద్ధి చేయాలన్నారు. ఉద్యోగులకు, పెన్షనర్లకు సౌకర్యాలు కల్పించడంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వం, కార్పొరేట్ వ్యవస్థకు సహాయం చేయడానికి మాత్రం వెనక్కి తగ్గడంలేదన్నారు. రుణాల ఎగవేతదారులకు క్లీన్‌చీట్ నిర్ణయాలు అమలు చేసిన కేంద్రం.. రిటైర్డ్‌ఉద్యోగుల పెన్షన్ ఇవ్వడానికి ఇబ్బంది పడుతుందన్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో ప్రజలు సంబరపడుతున్నారని, ఒక పొలిటికల్ పార్టీ పట్ల ఇంతటి వ్యతిరేకతను తన జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు. రామ్మోహన్, రవీందర్ ఉన్నారు.