సినీ ఇండస్ట్రీ నుంచి ఏ ఒక్కరూ సహాయం చేయలేదు : కాంతారావు కుమారుడు రాజా

రవీంద్రభారతిలో టీఎల్ కాంతారావు శత జయంతి వేడుకలు

ఆస్తులను అమ్మి మా నాన్న సినిమాలు తీశారు : కాంతారావు కుమారుడు రాజా

హైదరాబాద్ : సినీ ఇండస్ట్రీ నుంచి ఇప్పటి వరకూ ఏ ఒక్కరూ తమకు సహాయం చేయలేదని ప్రఖ్యాత నటుడు టీఎల్ కాంతారావు కుమారుడు రాజా ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా సహాయం చేస్తామని గతంలో చెప్పిన వాళ్లు.. ఆ హామీని ఇప్పుడు మర్చిపోయారని చెప్పారు. తాము కూడా ఎవరిని చేయి చాచి అడగలేదన్నారు. తమ తండ్రి ఉన్న ఆస్తులను అమ్మి సినిమాలు తీశారని చెప్పారు. తమ తండ్రి బతికి ఉన్న సమయంలోనే ఎలాంటి పాత్రలు రాలేదని, ఆయన చనిపోయిన తర్వాత తమను ఎవరు పట్టించుకుంటారని అన్నారు. తమ తండ్రి చనిపోయిన తర్వాత చాలా ఆర్థికంగా నష్టపోయామన్నారు. క్యాన్సర్ నివారణ కోసం డబ్బంతా ఖర్చు పెట్టామని చెప్పారు. గతంలో మద్రాసులోని ఓ బంగ్లాలో ఉన్న తాము ఇప్పుడు సిటీకి దూరంగా అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు ఎక్కడైనా ల్యాండ్ లేదా ఇల్లుగానీ కేటాయించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాటు కాంతారావు శత జయంతి కార్యక్రమాలను నిర్వహిస్తుందని తాము భావిస్తున్నట్లు చెప్పారు. 

కాంతారావు శత జయంతి వేడుకలు ప్రారంభం

రవీంద్రభారతి పైడీ జయరాజ్ థియేటర్ లో టీఎల్ కాంతారావు శత జయంతి వేడుకలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. వెండితెరపై తెలుగు వాళ్లు మరువలేని కథానాయకుడు దివంగత టీఎల్ కాంతారావు అని జూలూరు గౌరీ శంకర్ అన్నారు. అప్పట్లో ఆయనకు ఉన్న వందల ఎకరాల భూములను అమ్మి సినిమాల కోసం ఖర్చు పెట్టారని చెప్పారు. తెలుగు తెరకు తన నటనను అంకితం చేసిన మహా నటుడని ప్రముఖులు కొనియాడారు.