తమిళనాడు బీఎస్పీ చీఫ్ హత్య కేసు నిందితుడి ఎన్‌‌కౌంటర్‌‌

  • సీన్  రీక్రియేషన్ కోసం ఘటనా స్థలానికి తీసుకెళ్లిన పోలీసులు
  • తుపాకీ లాక్కొని కాల్పులు జరపగా ఎన్​కౌంటర్ చేశామన్న పోలీసులు

చెన్నై: తమిళనాడు బీఎస్పీ చీఫ్ కె.ఆర్మ్‌‌స్ట్రాంగ్ హత్య కేసు నిందితుల్లో ఒకరైన తిరువేంగడం పోలీసుల ఎన్​కౌంటర్​లో మరణించాడు. ఈనెల 5న చెన్నైలో ఆర్మ్ స్ట్రాంగ్  తన ఇంటి సమీపంలో కన్​స్ట్రక్షన్ వర్క్  జరుగుతున్న చోట మాట్లాడుతుండగా ఆరుగురు వ్యక్తులు కత్తులతో ఆయనను దారుణంగా నరికి చంపారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితుల్లో ఒకరైన తిరువేంగడంను పోలీసులు అరెస్టు చేశారు.

సీన్  రీక్రియేషన్  చేయడానికి, అలాగే హత్యకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు శనివారం సాయంత్రం తిరువేంగడంను ఘటనా స్థలానికి తీసుకెళ్లారు. అక్కడ ఒక పోలీసు నుంచి నిందితుడు తుపాకీ లాక్కొని కాల్పులు జరపడంతో ఆత్మరక్షణ కోసం తాము అతడిని షూట్  చేశామని పోలీసులు తెలిపారు. బుల్లెట్​ గాయాలైన నిందితుడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయాడని డాక్టర్లు తెలిపారు.