ఢిల్లీ: సస్పెన్షన్ వేటు పడిన టీఎంసీ నేత మహువా మొయిత్రా తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలంటూ నోటీసులు జారీ అయ్యాయని తెలుస్తోంది. 30 రోజుల గడువులోగా ఆమె బంగ్లాను ఖాళీ చేయాల్సి ఉంటుందని తెలిపాయి. లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు పారిశ్రామికవేత్త హీరానందాని నుంచి మొయిత్రా డబ్బులు, ఖరీదైన కానుకలు తీసుకున్నారని, ఆమె పార్లమెంట్ లాగిన్ వివరాలను దుబాయ్ నుంచి యాక్సెస్ చేశారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.
దీనిపై దర్యాప్తు చేపట్టిన ఎథిక్స్ కమిటీ.. మహువా అనైతిక ప్రవర్తన, సభాధిక్కరణకు పాల్పడ్డారని పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా తన పార్లమెంట్ లాగిన్ వివరాలను బయటి వ్యక్తులకు ఇచ్చినట్లు నిర్ధారించింది. ఈ నివేదికకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. దాంతో ఆమె లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దయింది. ప్రస్తుతం బంగళా ఖాళీ చేయాలంటూ పార్లమెంటు అధికారులు నోటీసులు ఇవ్వడం గమనార్హం.