
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి మహ్మమద్ షామా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. రోహిత్ శర్మ లావుగా ఉన్నాడంటూ ఆమె చేసిన కామెంట్స్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మహ్మమద్ షామా కామెంట్స్‌పై బీజేపీ విమర్శల వర్షం కురిపించింది. ఈ తరుణంలో కెప్టెన్ రోహిత్ శర్మపై టీఎంసీ సీనియర్ నేత, ఎంపీ సౌగత సౌగత రాయ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. రోహిత్ శర్మపై కాంగ్రెస్ నాయకురాలు షామా చేసిన వ్యాఖ్యలను సమర్థించిన సౌగత రాయ్.. ఆమె చేసిన కామెంట్స్ తప్పేమి కాదన్నారు.
అధిక బరువుతో బాధపడుతోన్న రోహిత్ ఫిట్‌గా లేడని.. అతడు జట్టులో ఉండకూడదని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. "దీనికి రాజకీయాలతో సంబంధం లేదు. మాట్లాడేది క్రికెట్ గురించి. రెండేళ్లకు ఒకసారి సెంచరీ సాధించడం, ఇతర మ్యాచ్‌లలో త్వరగా అవుట్ కావడం వల్ల జట్టులో రోహిత్ శర్మ స్థానం దక్కదు. అతను జట్టులో కెప్టెన్‌గా ఉండకూడదు. రోహిత్ శర్మపై కాంగ్రెస్ నాయకురాలు షామా చేసిన వ్యాఖ్యలు సరైనవే. నిజంగానే రోహిత్ శర్మ అధిక బరువుతో ఉన్నాడు. కానీ ప్రజలు పట్టించుకోనట్లున్నారు" అని రాయ్ హాట్ కామెంట్స్ చేశారు.
మనం ఫిట్‌గా, సమర్థుడైన కెప్టెన్ గురించి మాట్లాడుకుంటే.. అలాంటి వాళ్లు జట్టులో చాలా మంది ఉన్నారని.. ఇటీవల అద్భుతంగా రాణిస్తున్న బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కు కెప్టెన్ అయ్యే అర్హత ఉందన్నారు ఎంపీ సౌగత రాయ్. కెప్టెన్ రోహిత్ శర్మపై మహ్మమద్ షామా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో కాంగ్రెస్ అధిష్టానం నష్ట నివారణ చర్యలకు దిగింది. ఈ మేరకు హిట్ మ్యాన్ గురించి పెట్టిన పోస్ట్ వెంటనే డిలీట్ చేయాలని షామాను ఆదేశించింది. పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు షామా ఆ ట్వీట్ తొలగించారు. మరీ సౌగత రాయ్ వ్యాఖ్యలపై టీఎంసీ ఇంతవరకు స్పందించలేదు. దీంతో టీఎంసీ ఏ విధంగా రియాక్ట్ అవుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
అసలు షామా మహ్మమద్ ఏమన్నారు..?
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచులో కెప్టెన్ రోహిత్ శర్మ 17 బంతుల్లో 15 పరుగులు చేసి ఔటయ్యాడు. రోహిత్ శర్మ విఫలం కావడంతో కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి షామా మొహ్మమద్ భారత కెప్టెన్‌పై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అధిక బరువు ఉన్నారు.. అతడు బరువు తగ్గాల్సి ఉందని బాడీ షేమింగ్ కామెంట్స్ చేశారు షామా.
అంతేకాకుండా.. భారతదేశం ఇప్పటివరకు కలిగి ఉన్న అత్యంత ఆకట్టుకోలేని కెప్టెన్ కూడా రోహిత్ శర్మనేనని షామా ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే రోహిత్ పై షామా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆమె వ్యాఖ్యలపై అటు రోహిత్ ఫ్యాన్స్‌తో పాటు బీజేపీ నేతలు విరుచుకుపడ్డారు. రోహిత్ సారథ్యంలో భారత్ ఐసీసీ టీ20 వరల్డ్ కప్ సాధించిందని ఆమెకు కౌంటర్ ఇస్తున్నారు హిట్ మ్యాన్ ఫ్యాన్స్.