నిర్మల్, వెలుగు: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, వెంటనే యూనియన్లను పునరుద్ధరించాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం నిర్మల్ లో టీఎంయూ ఆదిలాబాద్ రీజినల్ సమావేశం నిర్వహించారు. చీఫ్ గెస్ట్‌గా హాజరైన థామస్ రెడ్డి మాట్లాడారు. ఆర్టీసీ యాజమాన్యం నిరంకుశంగా వ్యవహరిస్తోందని, కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తోందని ధ్వజమెత్తారు. కార్మికులకు అత్యవసర సమయాల్లో సెలవులు కూడా మంజూరు చేయడం లేదని, 8 గంటల పని కాకుండా 12 నుంచి 14 గంటల వరకు పని చేయించుకుంటున్నారని ఆరోపించారు. ఉద్యోగులు దాచుకున్న సీసీఎస్ డబ్బులను యాజమాన్యం వాడుకుందని, ఆ డబ్బులను కార్మికులకు వెంటనే చెల్లించాలన్నారు. ఆర్టీసీ కార్మికులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.
రీజినల్ సెక్రటరీగా గంగాధర్
తెలంగాణ మజ్దూర్ యూనియన్ అదిలాబాద్ రీజియన్ సెక్రటరీగా నిర్మల్ డిపోకు చెందిన ఆర్.గంగాధర్‌ను ఎన్నుకున్నారు. గంగాధర్‌కు థామస్ రెడ్డి నియామక పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏఆర్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు కమలాకర్ గౌడ్, కోశాధికారి రాఘవరెడ్డి, సలహాదారులు యాదయ్య, రాష్ట్ర కార్యదర్శి
ఎల్.రమేశ్, పలు డిపోల కార్యదర్శులు, కార్మికులు పాల్గొన్నారు.