హైదరాబాద్, వెలుగు: ఉద్యోగులు, పెన్షనర్లకు పెండింగ్ లో ఉన్న 4 డీఏలను వెంటనే రిలీజ్ చేయాలని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేనీ కోరారు. పెండింగ్‌లో ఉన్న అన్ని బిల్లులను క్లియర్ చేయాలన్నారు.ట్రెజరీ డిపార్ట్‌మెంట్ ద్వారే బిల్లులను క్లియర్ చేసే పాత విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు.
బుధవారం నాంపల్లిలోని యూనియన్ ఆఫీస్ లో టీఎన్జీవో ఈసీ మీటింగ్ జరిగింది. దీనికి 33 జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, హైదరాబాద్ సిటీ, కేంద్ర సంఘం నేతలు అటెండ్ అయి ఉద్యోగుల సమస్యలపై పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మారం జగదీశ్వర్ , ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేనీ మాట్లాడుతూ.. రెండో పీఆర్సీపై కమిషన్ చైర్మన్, మెంబర్లు ఉద్యోగ సంఘాల నుంచి ప్రతిపాదనలు తీసుకొవాలన్నారు.
పీఆర్సీ రిపోర్ట్ ను తెప్పించుకొని ధరల పెరుగుదల ఆధారంగా 51శాతం ఫిట్‌మెంట్ తో పీఆర్సీ ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈహెచ్ ఎస్ అమలు కాక ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే ఈహెచ్ ఎస్ ను ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. కొత్త జిల్లాలకు కేడర్ స్ర్టెంత్ ను ప్రకటించాలని, ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ రిక్రూట్ మెంట్ ను రద్దు చేయాలన్నారు.
సీపీఎస్ రద్దు, 317జీవో సవరణ, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్, కారుణ్య నియామకాలు వంటి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేశారు. మీటింగ్ లో నేతలు రామినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.