హైదరాబాద్, వెలుగు: ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వర్, ముజీబ్ విజ్ఞప్తి చేశారు. సీపీఎస్ ను రద్దు చేయాలని కోరారు. ఏపీలోని తెలంగాణ ఉద్యోగులను తిరిగి తీసుకొచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు. అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ( ఏఐఎస్ జీఈఎఫ్) జాతీయ కౌన్సిల్ సమావేశాలు బుధవారం ముగిశాయి. వీటికి 24 రాష్ర్టాల నుంచి ఉద్యోగ సంఘాల నేతలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఏఐఎస్ జీఈఎఫ్ వైస్ ప్రెసిడెంట్ మారం జగదీశ్వర్ మాట్లాడుతూ.. తెలంగాణలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తామని తెలిపారు. సీపీఎస్ రద్దు, పెండింగ్ డీఏల విడుదల, కొత్త పీఆర్సీ, కొత్త జిల్లాల్లో క్యాడర్ స్ర్టెంత్, హెల్త్ కార్డులు, ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీ తదితర సమస్యలపై జేఏసీ ఆధ్వర్యంలో సీఎంతో చర్చించి పరిష్కరించుకుం టామని చెప్పారు. సమావేశాల్లో ఏఐఎస్ జీఈఎఫ్ నేషనల్ ప్రెసిడెంట్ సుభాశ్, ప్రధాన కార్యదర్శి శ్రీకుమారన్ పాల్గొన్నారు.