ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించండి

ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించండి
  •  పెండింగ్ డీఏలు, పీఆర్సీ, ఈహెచ్ఎస్ అమలు చేయండి
  •   కొత్త జిల్లాల్లో పోస్టులు సాంక్షన్ చేయండి
  •   సీఎం రేవంత్ రెడ్డిని కోరిన టీఎన్జీవో నేతలు

హైదరాబాద్, వెలుగు: ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డిని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వర్, ముజీబ్ హుస్సేనీలు కోరారు. బుధవారం సీఎంను ఆయన నివాసంలో టీఎన్జీవో నేతలు కస్తూరి వెంకట్, రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ లక్ష్మణ్, భాగ్యనగర్ టీఎన్జీవో జీఎస్ సత్యనారామణ గౌడ్.. సీఎం రేవంత్​తో 30 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పీఆర్సీ, పెండింగ్ డీఏలు, సీపీఎస్ ఎస్ రద్దు, కొత్త జిల్లాలలో అదనపు క్యాడర్స్, ఉద్యోగుల హెల్త్ కార్డ్స్ అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లామని అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తెలిపారు. 

ఉద్యోగుల సమస్యలను సీఎంకు వినతిపత్రం రూపంలో అందచేశారు. 2023 జులై1 నుంచి రావాల్సిన పీఆర్సీకి 51 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలన్నారు. హెచ్ వోడీల నుంచి 12.5 శాతం కోటాతో ఉద్యోగులను సెక్రటేరియెట్ కు బదిలీ చేయాలన్నారు. ఉద్యోగుల సమస్యలను చర్చించటానికి స్టేట్, జిల్లా స్థాయిలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ను ఏర్పాటు చేయాలని సీఎంను కోరారు. ఎల్బీ స్టేడియంలో 50 వేల మందితో ఏప్రిల్ లో జరగనున్న టీఎన్జీవో 80వ వసంతాల వేడుకకు రావాలని సీఎంను నేతలు ఆహ్వానించగా సీఎం అంగీకరించినట్లు తెలిసింది.

మూడునెలల్లో పెండింగ్ బిల్లులు క్లీయర్​

ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉన్న తమ ప్రభుత్వం అన్ని సమస్యలను పరిష్కరిస్తుందని టీఎన్జీవో నేతలకు సీఎం రేవంత్​సూచించారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు చెల్లించడానికి ఇప్పుడున్న పరిమితిని పెంచి రాబోయే రెండు మూడు నెలల్లో బిల్లులు క్లీయర్ చేస్తామని హామీ ఇచ్చారు. వచ్చే ఏప్రిల్ నుంచి నిధులు కొరత సమస్య తీరుతుందని ఉద్యోగుల సమస్యను పరిష్కరిస్తామని సీఎం వెల్లడించారు. వచ్చే నెలలో ఆర్థిక భారం లేని సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.