హైదరాబాద్, వెలుగు : టీఎన్జీవో కేంద్ర సంఘానికి కొత్త కార్యవర్గం ఎన్నికైంది. అధ్యక్షుడిగా మామిళ్ల రాజేందర్ (సంగారెడ్డి), జనరల్ సెక్రటరీగా మారం జగదీశ్వర్ (కరీంనగర్) ఎన్నికయ్యారు. రాజేందర్ రెండోసారి తిరిగి ఎన్నికయ్యారు. ప్రతాప్ గతంలో జనరల్ సెక్రటరీగా ఉండగా ఆయన స్థానంలో మారం జగదీశ్వర్ ఎన్నికయ్యారు. కొత్త కార్యవర్గం మూడేండ్ల పాటు కొనసాగుతుంది. శనివారం నాంపల్లిలోని టీఎన్జీవో భవన్ లో కొత్త కార్యవర్గానికి ఎన్నికలు నిర్వహించగా అన్ని పదవులు ఏకగ్రీవం అయ్యాయి.
అన్ని జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, కేంద్ర సంఘం సభ్యులు మొత్తం 105 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల అధికారిగా జి.వెంకటేశం, సహాయ ఎన్నికల అధికారిగా శశికాంత్ రెడ్డి వ్యవహరించారు. అసోసియేట్ అధ్యక్షులుగా కస్తూరి వెంకటేశ్వర్లు, ఎం.సత్యనారాయణ గౌడ్, ట్రెజరర్ గా రామినేని శ్రీనివాసరావు , పది మంది ఉపాధ్యక్షుడు, కార్యదర్శులు, ఇతర కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. రెండోసారి ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నికైన మామిళ్ల రాజేందర్, తొలిసారి జనరల్ సెక్రటరీగా ఎన్నికైన మారం జగదీశ్వర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఉద్యోగులందరూ తమపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే ఈహెచ్ఎస్ కార్డులు, పీఆర్సీ ఇతర పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తామని పేర్కొన్నారు.