భద్రాద్రిలో  భక్తులు ఎక్కడుండాలె?

భద్రాచలం, వెలుగు: భద్రాద్రి రామయ్య దర్శనానికి వచ్చే భక్తులు తాము ఎక్కడ ఉండాలని ప్రశ్నిస్తున్నారు. సాధారణ రోజుల్లో వచ్చే భక్తులకు సైతం దేవస్థానం వసతి కల్పించక పోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దాతలు కట్టించిన కాటేజీలను స్వాధీనం చేసుకోకపోవడంతో పాటు ఉన్న వాటికి రిపేర్లు చేయించక పోవడంతో వసతి దొరకక ప్రైవేట్​ లాడ్జీలను ఆశ్రయించాల్సి వస్తోందని వాపోతున్నారు. సాధారణ భక్తులు ఇసుక తిన్నెలు, గోదావరి కరకట్టపై ఉన్న చెట్ల నీడలో సేద తీరుతున్నారు. మార్చి 30న శ్రీరామనవమి, 31న శ్రీరామ పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం ఉత్సవాలకు వేలాది మంది భక్తులు వస్తారు. అప్పటి వరకైనా వసతి కల్పించడంపై దేవస్థానం దృష్టి పెట్టాలని డిమాండ్​ చేస్తున్నారు. 

హ్యాండోవర్​ చేసుకుంటలే..

నాలుగున్నరేండ్ల కింద టీటీడీ రూ.4.70 కోట్లతో తానీషా కల్యాణ మండపం పక్కన ఒక కాటేజీ నిర్మించింది. దీన్ని ఇప్పటికీ దేవస్థానం హ్యాండోవర్​ చేసుకోలేదు. ఇందులో 32 ఏసీ గదులు, 4 డార్మెటరీలు, ఒక కల్యాణ మండపం ఉన్నాయి. ఏదైనా ఉత్సవాల సమయంలో దీనిలో 5 వేల మంది భక్తులకు వసతి కల్పించవచ్చు. ప్రస్తుతం రూ.3.60 కోట్లతో ఈ కాటేజీకి ఎదురుగా జానకీ సదనం నిర్మాణం ప్రారంభించారు. కానీ ఇంకా ఏడాది కాలం పడుతుంది. రంగనాయకుల గుట్టపై రామ, భాస్కర, సీతానిలయం కాటేజీలు నిర్మాణం పూర్తయ్యాయి. వాటిని కూడా హ్యాండోవర్​ చేసుకోవడం లేదు. దాతలతో దేవస్థానానికి కమ్యూనికేషన్​ గ్యాప్​ రావడంతో కాటేజీలు పూర్తయినా అప్పగించడంలో ఆలస్యం అవుతోంది. కొన్ని కాటేజీలు సగంలోనే నిలిచిపోయాయి. ఇవన్నీ అందుబాటులోకి వస్తే భక్తులకు కొంత ఊరట కలుగుతుంది.

రిపేర్లను చేయిస్తలేరు..

రంగనాయకుల గుట్టపై టీటీడీ, అన్నవరం సత్రాలు రిపేర్లు చేయిస్తే సామాన్య భక్తులకు వసతి కష్టాలు తీరుతాయి. ఏండ్ల తరబడి అవి ఖాళీగా ఉంటున్నా దేవస్థానం పట్టించుకోవడం లేదు. ఉత్సవాల సమయంలో వెయ్యి మందికి ఇక్కడ వసతి కల్పించవచ్చు. భక్తులు పెరుగుతున్నా అందుకు అనుగుణంగా వసతి ఏర్పాట్లు చేయడంలో దేవస్థానం దృష్టి పెట్టడం లేదనే విమర్శలున్నాయి. రంగనాయకుల గుట్టపై 28 కాటేజీలు ఉంటే 10 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 106 గదులు రెంట్​కు ఇస్తున్నారు. సౌమిత్రి సదనంలో 30, శ్రీరామసదనంలో 14 నాన్​ ఏసీ గదులు, శ్రీరామనిలయంలో 62,  సీతానిలయంలో 38 గదులు ఉన్నాయి. అయితే శ్రీరామ, సీతా నిలయాలు ప్రైవేటుకు అప్పగించారు. రిపేర్లపై దృష్టి సారిస్తే వసతి సమస్యకు చెక్​ పెట్టొచ్చు. 

కేటాయింపుల్లోనూ గందరగోళం..

మామూలు రోజుల్లో కూడా వీకెండ్, ఇతర సెలవు దినాల్లో మాదిరిగా పాపికొండల యాత్రకు వేల సంఖ్యలో భక్తులు, పర్యాటకులు వస్తున్నారు. వారు భద్రాచలంలో బస చేయాలంటే ఇబ్బంది పడుతున్నారు. బ్రహ్మోత్సవాలు, ముక్కోటి ఏకాదశి తదితర ఉత్సవాల సమయంలో పోలీసు, రెవెన్యూ ఆఫీసర్లు దేవస్థానం గదులతో పాటు ప్రైవేటు లాడ్జీలు, రెస్ట్ రూమ్​లను స్వాధీనం చేసుకుంటున్నారు. మిగిలిన రూమ్​లను దేవస్థానం వీవీఐపీలు, దాతలకు కేటాయిస్తోంది. భక్తులకు రూమ్​లు దొరకడం లేదు.

ఆదాయంపైనే శ్రద్ధ పెడ్తున్రు..

దేవస్థానం అధికారులకు ఆదాయం మీద ఉన్న శ్రద్ధ భక్తులపై లేదు. పుష్కరాలు, సీతారాముల కల్యాణం, ముక్కోటి ఉత్సవం ఏదైనా భక్తులు తిప్పలు పడాల్సిందే. దాతల సహకారంతో డార్మెటరీ హాళ్లు కట్టిస్తే సామాన్య భక్తులకు ఉపయోగంగా ఉంటుంది. 
- బూసిరెడ్డి శంకర్​రెడ్డి, 

గాంధీపథం కన్వీనర్, భద్రాచలం
చర్యలు తీసుకుంటున్నాం..

రిపేర్ల విషయంలో ప్రపోజల్స్ తయారు చేసి పంపించాం. టీటీడీకి లెటర్​ రాసినా ఇంకా రిప్లై రాలేదు. అన్నవరం దేవస్థానం వాళ్లు తాము రిపేర్లు చేయలేమని చేతులెత్తేశారు. టీటీడీ కట్టించిన కొత్త కాటేజీ ఇంకా అప్పగించలేదు. మిగిలిన సత్రాల రిపేర్లపై దృష్టి పెట్టాం.- వి రవీందర్​రాజు, ఈఈ, శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం