టెక్నాలజీ అప్‌డేట్ అవుతూ.. కొత్త కొత్త యాప్స్ అందుబాటులోకి వస్తున్నాయి. వాటితో పాటే నకిలీ యాప్స్ కూడా పుట్టుకొస్తున్నాయి. ఏవి నిజమైన యాప్స్? ఏవి కాదో? అని తెలుసుకునేందుకు వీలు లేకుండా యాప్స్‌ను క్రియేట్ చేస్తున్నారు హ్యాకర్లు. అంతేకాకుండా కొన్ని స్పామ్ యాప్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు. అలాంటి వాళ్లకు చెక్ పెట్టేందుకు గూగుల్ ప్లే స్టోర్ కొత్త గైడ్‌లైన్స్ తీసుకురానుంది. ఈ గైడ్‌లైన్స్ 2021 చివరి నాటికి అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు గూగుల్ చెప్పింది. యాప్ టైటిల్‌ను 30 క్యారెక్టర్లకు తగ్గిస్తుంది. అంతేకాకుండా యాప్ పనితీరును సూచించే కీ వర్డ్స్‌ను నిషేధిస్తుందట. ఐకాన్‌లో డెవలపర్ ప్రమోషన్ పేరును తొలగించనుంది. వినియోగదారులను తప్పుదారి పట్టించేలా యాప్ ఐకాన్‌పై ఇచ్చే గ్రాఫిక్స్‌ను కూడా నిషేధిస్తున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటుగా క్యాపిటల్ ఫాంట్స్ వాడకాన్ని, యాప్ పేరులో ఎమోజీలను వాడకూడదని గైడ్‌లైన్స్ రిలీజ్ చేసింది. ఈ గైడ్‌లైన్స్ పాటించని యాప్స్‌ను గూగుల్ ప్లే స్టోర్‌లోకి అనుమతించబోమని కంపెనీ చెప్పింది. లిస్టింగ్ ప్రివ్యూవ్‌కి సంబంధించి కూడా కొత్త ఎసెట్ గైడ్‌లైన్స్ రిలీజ్ చేసింది గూగుల్. ఆ యాప్‌ను యూజర్స్ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చా? లేదా? అనే విషయానికి సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని యాప్ డెవలపర్స్‌కు సూచించింది గూగుల్. ప్రివ్యూవ్ ఎసెట్స్ కూడా జనాలకు బాగా అర్థమయ్యే విధంగా ఉండాలని చెప్పింది. 2021 సెకండాఫ్‌లో ఈ గైడ్‌లైన్స్ అమల్లోకి వస్తాయని, ఏ రోజు నుంచి అనేది తొందర్లోనే ప్రకటిస్తామని గూగుల్ చెప్పింది.