అప్పుల పాలైన రాష్ట్రాన్ని బాగుపరచాలంటే బీజేపీ పార్టీకి ఓటెయున్రి: రాజగోపాల్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశమంతా కూడా మునుగోడు వైపు చూస్తుందని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. 60 ఏళ్లు పోరాటం చేసి, 1200 మంది ప్రాణత్యాగం చేసి తెచ్చిన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన సాగిస్తున్నాడని ఆరోపించారు. అసెంబ్లీలో ప్రశ్నించే ప్రతిపక్షం  ఉండాలని 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేని ప్రజలు గెలిపించి పంపించారని చెప్పారు. తెలంగాణ జాతిపిత అని చెప్పుకునే కేసీఆర్.. ఆయన్ను ప్రశ్నించే వాడే ఉండొద్దని 12 మంది ఎమ్మెల్యేలు కొన్న దుర్మార్గుడని దుయ్యబట్టారు. దళితులకు మూడెకరాలు, రుణమాఫీ, డబుల్ బెడ్రూం ఇల్లులు, ఉచిత విద్య, ఉచిత వైద్యం, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పన అని కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడిగే ప్రతిపక్షం లేకుండా చేశాడని విమర్శించారు. ప్రశ్నించే గొంతు లేకుండా చేసిన కేసీఆర్ ని ఏం చేయాలి అన్న రాజగోపాల్... ప్రజల పక్షాన గొంతు వినిపించాలా వద్దా అని ప్రశ్నించారు. అందుకే మునుగోడు గడ్డమీద దండు పుట్టిందని చెప్పారు.

మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పు మీదనే తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ఉంటది

తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదని రాజగోపాల్ ఆరోపించారు. తన పోరాటం కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గానీ, జగదీష్ రెడ్డి మీద గానీ కాదని.. కుటుంబ పాలన మీద, నియంత మీద, ఒక అవినీతి పాలన మీద అని స్పష్టం చేశారు. మునుగోడులో మీరు ఇచ్చే తీర్పు రేపు తెలంగాణలో మార్పు కాబోతుందని చెప్పారు. ఒక రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి కోసమో, ఒక పార్టీ కోసమో రాలేదు ఎన్నిక అన్న ఆయన.. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, తెలంగాణ ప్రజల రాత మార్చడానికి వచ్చిందని తెలిపారు. మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పు మీదనే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉందని స్పష్టం చేశారు. ఒక ఎమ్మెల్యే రాజీనామా చేస్తే 86 మంది ఎమ్మెల్యేలు,15 మంది మంత్రులు,12 మంది ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఒక ముఖ్యమంత్రి వచ్చారు...  అవసరమా.. అని రాజగోపాల్ ప్రశ్నించారు. నిజంగా అభివృద్ధి చేసి ఉంటే ఇంతమంది రావాల్సిన అవసరం ఏముంది అని నిలదీశారు.

తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంటులో కొట్లాడిన గొంతు ఇది

రాజకీయాలకు విలువలేదని, రాత్రికి రాత్రే నాయకుల్ని డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నారని రాజగోపాల్ ఆరోపించారు. తన వెంట ఉండే నాయకుల్ని బెదిరించి మరి తీసుకెళ్తున్నారని విమర్శించారు. కేసీఆర్ పతనం ఈ మునుగోడు గడ్డ నుంచే ప్రారంభమవుతుందన్న ఆయన... తెలంగాణ కోసం పార్లమెంటులో వినిపించిన గొంతు ఇది అని గర్వంగా చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంటులో కొట్లాడిన గొంతు ఇది అంటూ స్వరం పెంచారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక మలి ఉద్యమం మునుగోడులో స్టార్ట్ అయిందని, భారతదేశ చరిత్రలో ఇటువంటి ఎన్నిక జరగదు, జరగబోదని తెలిపారు. గట్టుప్పల్ మండలాన్ని తీసుకొచ్చిన ఘనత, కేసీఆర్ ని లెంకలపల్లికి తీసుకొచ్చిన ఘనత తన రాజీనామాది అని గొప్పగా చెప్పుకున్నారు.

మునుగోడును తీర్చిదిద్దేవరకు నిద్రపోను

2018లో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా... తనను నమ్మి గెలిపించారని రాజగోపాల్ అన్నారు. మీ రుణం జన్మజన్మలకు తీర్చుకోలేనిదని చెప్పారు. ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసి తెలంగాణలోనే నెంబర్ వన్ నియోజకవర్గంగా మునుగోడును తీర్చిదిద్దేవరకు తాను నిద్రపోనని ప్రకటించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలలాగా దొంగ చాటుగా అమ్ముడు పోలేదని, గెలిచిన పార్టీని గౌరవించి ఆ పార్టీ నుంచి రాజీనామా చేసి, మునుగోడులోని రెండు లక్షల మంది ప్రజల సమక్షంలో బీజేపీ కండువా  కప్పుకున్నానని స్పష్టం చేశారు. "నిన్ను నమ్ముకున్న ప్రజలను తలదించుకునే పని చేయొద్దు అని మా అమ్మ చెప్పింది... నువ్వు ధర్మం కోసం న్యాయం కోసం పోరాటం చేసే సందర్భంలో కొట్లాడుతుంటే పదిమంది కుక్కలు మొరుగుతున్న పట్టించుకోకు  అని చెప్పింది" అంటూ రాజగోపాల్ రెడ్డి గతంలో తన తల్లి చెప్పిన మాటలను గుర్తుకు తెచ్చుకున్నారు.

మునుగోడు  ప్రజలు ఇచ్చే తీర్పుతో కేసీఆర్ పని ఖేల్ కతం దుకాణం బంద్

మన ఆత్మగౌరవాన్ని డబ్బులకు అమ్ముకోవద్దన్న రాజగోపాల్ రెడ్డి... మునుగోడు ప్రజలు ఏం తీర్పిస్తారని ప్రపంచమమతా చూస్తోందని చెప్పారు. ప్రజలు రాజగోపాల్ రెడ్డి వైపు ఉంటారా... అవినీతి సొమ్ముకు అమ్ముడుపోతారా..  అని దేశమంతా చూస్తోందన్నారు. మునుగోడు  ప్రజలు ఇచ్చే తీర్పుతో కేసీఆర్ పని ఖేల్ కతం దుకాణం బంద్ అని కామెంట్ చేశారు. ఉద్యోగస్థులు, నిరుద్యోగులు, ఉద్యమకారులు, ప్రతి ఒక్కరూ మునుగోడు వచ్చి ప్రచారం చేస్తున్నారన్న ఆయన.. ఇప్పుడు కేసీఆర్ వెంట ఉన్న ఒక తలసాని శ్రీనివాస్ యాదవ్, ఒక పువ్వాడ అజయ్ కుమార్, ఒక గంగుల కమలాకర్ వీళ్ళా ఉద్యమకారులు అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమకారులందరినీ అవమానించి బయటికి పంపించారని ఆరోపించారు. ఆగమైన తెలంగాణ రాష్ట్రాన్ని, అప్పుల పాలైన తెలంగాణ రాష్ట్రాన్ని బాగుపరచాలంటే  బీజేపీ పార్టీకి ఓటేసి గెలిపించండని అభ్యర్థించారు.