స్టూడెంట్లకు ఫీజు బకాయిలు చెల్లించాలి

 స్టూడెంట్లకు ఫీజు బకాయిలు చెల్లించాలి
  • బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో విద్యా వ్యవస్థ గాడి తప్పిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. స్టూడెంట్ల చదువులు గాలిలో దీపంలా మారాయన్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్​రెడ్డి స్పందించి ఫీజు బకాయిలు చెల్లించి, విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం విద్యానగర్ బీసీ భవన్ లో ఫీజులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ నేతృతంలో ‘విద్యార్థుల ఫీజుల దీక్ష’ నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. విద్య, నాణ్యమైన భోజనం కోసం ఒకవైపు విద్యార్థులు దీక్షలు చేస్తుంటే.. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాలన సంబురాలు జరుపుకోవడం సిగ్గుచేటు అన్నారు. ఫీజు రీయింబర్స్​మెంట్ ను ఎత్తివేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. 

వేముల రామకృష్ణ మాట్లాడుతూ.. స్కాలర్షిప్​లు, పెండింగ్​ఫీజు బిల్లులు చెల్లించి విద్యావ్యవస్థను కాపాడాలని కోరారు. కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్, సి.రాజేందర్, నందగోపాల్, అనంతయ్య, పి.సుధాకర్, ఉదయ్ నేత, మధుసూదన్ రావు, రవికుమార్ యాదవ్, పృథ్వీగౌడ్, అరవింద్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.