- ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మొక్కలు నాటేందుకురూ. 15 లక్షలు ఖర్చయ్యాయట!
- వర్ధన్నపేట మున్సిపాలిటీలో రూ.3 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు
- ఆటోలు, ఫాగింగ్ మెషిన్లకు రూ.55.41 లక్షలు మీటింగ్‍లో చాయ్ బిస్కెట్లకు రూ.లక్ష
- అవినీతిపై అధికార, విపక్ష కౌన్సిలర్ల ఆందోళన
వరంగల్/వర్ధన్నపేట, వెలుగు: వరంగల్జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీలో బిల్లుల్లో గోల్మాల్చేసి రూ. 3 కోట్ల వరకు అవినీతికి పాల్పడ్డారు. ఇష్టారాజ్యంగా నిధులు మింగేయడంపై ప్రతిపక్షాలతోపాటు టీఆర్ఎస్కౌన్సిలర్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్కువ పనులు చేసి ఎక్కువ బిల్లులు పెడుతున్నారని, చేయని పనులకు ఇష్టారీతిన లెక్కలు కడుతున్నారని ఆరోపిస్తున్నారు. 2020 నుంచి ఆగస్ట్ 2022 వరకు మొత్తం రూ.6.71కోట్ల నిధులకుగాను రూ.6.44 కోట్ల ఖర్చు చూపారు. ఓ వైపు పట్టణంలో ఏ కాలనీ చూసినా దోమలు, దుర్వాసనతో కంపు కొడుతుంటే అధికారులు మాత్రం శానిటేషన్ కు రూ. లక్షలు ఖర్చు చేస్తున్నట్లు చూపారు. బ్లీచింగ్ పౌడర్ కొనుగోలు రూ.4.08 లక్షలు, శానిటేషన్ వెహికల్ అద్దె రూ. 3.78 లక్షలు, వెహికల్స్డీజిల్కోసం రూ.14.03 లక్షలు, వెహికల్స్ రిపేర్లకు రూ. 1.26 లక్షలు, సర్వీసింగ్ రూ.70,625, ట్రాక్టర్లు, ఆటోలు, ఫాగింగ్ మెషిన్ల కొనుగోలుకు రూ. 55.41లక్షలు, ప్రత్యేక శానిటేషన్ చెల్లింపులు రూ.6.63 లక్షలు, కెమికల్స్ రూ.7.26 లక్షలు, సైడ్ కాలువల శుభ్రానికి రూ.3.97 లక్షలు, కొవిడ్–19 కంట్రోల్ కోసం రూ. 4.26 లక్షలు, శానిటేషన్ ఖర్చులు రూ. 4.81 లక్షలు, కమిషనర్ వాడే వెహికల్ కిరాయి రూ. 8,53,037 అంటూ లెక్కలు చూపారు. వార్డుల్లో మొరం పోసినందుకు రూ.2.52 లక్షలు, పాత బావుల్లో మొరం పోసినందుకు రూ. 2.31లక్షలు, ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్ గోడ కూల్చడానికి రూ.1.10 లక్షల ఖర్చు చూపారు.
జేబులు నింపిన హరితహారం
అధికార పార్టీ లీడర్లతో జతకలిసి మున్సిపల్ అధికారులు హరితహారం పేరుతో ఇష్టారీతిన లెక్కలు చూపారనే విమర్శలున్నాయి. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‍లో మొక్కలు నాటి మొరం పోసి.. బోర్డు పెట్టినందుకు రూ.15 లక్షలు ఖర్చయినట్లు చూపారు. ఇక పట్టణ ప్రగతి ఖర్చు రూ.61.51 లక్షలు, హరితహారం చెల్లింపులు రూ.21.34 లక్షలు, నర్సరీ కోసం రూ.12.46 లక్షలు, పట్టణ ప్రకృతి వనాల ఫెన్సింగ్ కు రూ.2.07 లక్షలు చూపారు. ఇక ఐదారుసార్లు నిర్వహించిన జనరల్ బాడీ మీటింగుల్లో చాయ్, బిస్కెట్, వాటర్ బాటిళ్ల కోసం రూ.లక్ష.. గ్రామ పంచాయతీ బిల్లులు రూ.14.17 లక్షలు చూపారు. మున్సిపాలిటీ పరిధిలో హైవేపై స్పీడ్ బ్రేకర్లు, సైన్ బోర్డుల ఏర్పాటుకు రూ.3.66 లక్షలు బతుకమ్మ, దసరా ఏర్పాట్ల ఖర్చు రూ.8.56 లక్షలుగా చూపారు. మున్సిపాలిటీలో నిధుల్లో అవినీతి జరిగిన మాట వాస్తవమేనని అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్లు దుమ్మెత్తి పోస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ రవీందర్, చైర్‍పర్సన్ అంగోతు అరుణ, వైస్ చైర్మన్ కొమాండ్ల ఎలేందర్‍రెడ్డి విచక్షణాధికార తీర్మానం పేరుతో కోట్ల రూపాయలు మింగేశారని మండిపడుతున్నారు. మున్సిపాలిటీలో 12 మంది కౌన్సిలర్లలో చైర్‍పర్సన్, వైస్ చైర్మన్ పోగా.. మిగతా టీఆర్‍ఎస్ 7, కాంగ్రెస్ 2, బీజేపీకి కౌన్సిలర్ అవినీతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ. 3 కోట్ల అవినీతిపై ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కౌన్సిలర్లంతా పట్టణంలో రోడ్డెక్కారు. ర్యాలీగా వెళ్లి అధికారులకు వినతిపత్రం అందించారు. బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ ఆధ్వర్యంలో కలెక్టర్ గోపిని కలిసి అవినీతిపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.