వింటర్ సీజన్‌లో ఎక్కువమంది ఎదుర్కొనే సమస్య చర్మం పొడిబారడం. చలికాలం వచ్చిందంటే చాలు చర్మం డ్రైగా మారిపోయి దురదలు, మంటలు వంటి ఎన్నోరకాల సమస్యలు వస్తుంటాయి. అయితే దీన్నుంచి విముక్తి పొందడానికి కాస్ట్లీ క్రీములు వాడుతుంటారు. కానీ ఇవి టెంపరరీ రిలీఫ్‌ను మాత్రమే అందిస్తాయి. స్కిన్ ప్రాబ్లమ్స్‌కు పర్మినెంట్ సొల్యూషన్ కావాలంటే స్నానం చేసేటప్పుడే కొన్నిజాగ్రత్తలు తీసుకోవాలి.
మసాజ్ అవసరం
చలికి పెదాలు పొడిబారడం, చర్మం పాలి పోవడం, మడమల్లో పగుళ్లు వంటి ఎన్నో సమస్యలు వస్తుంటాయి. మోకాళ్లు, మోచేతుల్లో కూడా చర్మం కందిపోయి, నల్లగా మారుతుంది. అందుకే శరీరానికి మసాజ్ అవసరం. టైం దొరికినప్పుడల్లా నూనెతో మసాజ్ చేస్తే చాలా ఉపయోగం ఉంటుంది. నువ్వులు, ఆలివ్, ఆవ నూనెల వంటివి మరింత మేలు చేస్తాయి. అయితే వీటిని శరీరానికి పట్టించే ముందు కాస్త వేడి చేయాలి. స్నానం చేసేముందు గోరువెచ్చని నూనెతో బాడీపై మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల స్నానం చేసేటప్పుడు చర్మంపై పడే నీళ్లు చర్మ రంధ్రాల్లోకి చేరిన ఆయిల్‌ను బయటకు పోకుండా లాక్ చేస్తాయి. దాంతో చర్మం పొడిబారకుండా తేమగా ఉంటుంది.
సబ్బుకు బదులు..
చలికాలంలో డైలీ వాడే సబ్బులే చర్మాన్ని ఎక్కువ పొడిగా మారుస్తుంటాయి. ఎందుకంటే ఈ సబ్బుల్లో ఆల్కహాల్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల చర్మం మరింత డ్రై అవుతుంది. అందుకే ఈ సీజన్‌లో గ్లిజరిన్ ఉండే సబ్బుల్ని వాడాలి. లేదంటే సబ్బుకు బదులు సున్నిపిండి వాడటం ఇంకా బెటర్. శెనగపిండి, పసుపు, పాలు, నిమ్మరసం కలుపుకుని శరీరమంతా పట్టించి స్నానం చేయడం వల్ల డ్రై స్కిన్ ప్రాబ్లమ్స్‌కు దూరంగా ఉండొచ్చు.
ప్యాక్స్ బెటర్
స్నానం చేసే పావుగంట ముందు బాడీకి కొన్ని రకాల ప్యాక్స్ వేయాలి. ఇలా చేస్తే చర్మ సమస్యలు తగ్గించొచ్చు. ఈ ప్యాక్స్‌లో ఎక్కువగా పాలతో ఉండేవే వాడాలి. పాలు–శెనగపిండి, పాలు–నిమ్మరసం, పాలు–పసుపు.. ఇలా ఏదో ఒక ప్యాక్ వేసుకుని ఆరాక స్నానం చేస్తే చర్మం తేమగా ఉంటుంది.
గుర్తుంచుకోవాలి ఇవి..
ప్రతిరోజూ గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయాలి. దీనివల్ల హార్ట్ బీట్ పెరగకుండా, తగ్గకుండా కంట్రోల్‌లో ఉంటుంది.
చలిగా ఉందని మరీ ఎక్కువ వేడివేడి నీళ్లతో స్నానం చేస్తుంటారు. అలా చేస్తే చర్మం పొడిబారిపోతుంది. కొన్నిసార్లు వేడి నీళ్ల వల్ల చర్మంపై పగుళ్లు కూడా వస్తాయి. అందుకే ఎంత చలిగా అనిపించినా గోరువెచ్చని నీళ్లతో మాత్రమే స్నానం చేయాలి.
తలస్నానం చేశాక జుట్టు త్వరగా ఆరిపోవాలని చాలామంది బ్లోయర్స్, హెయిర్ డ్రయ్యర్స్ లాంటివి వాడుతుంటారు. వీటివల్ల చర్మం పొడిబారుతుంది. అందుకుని ఈ సీజన్‌లో వీటిని వాడకపోతేనే బెటర్.
చర్మం పగలకుండా, పొడిబారకుండా ఉండాలంటే స్నానం చేశాక మాయిశ్చరైజర్ రాయాలి. లేదా వెన్న, ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె రాసినా చర్మం తేమగా ఉంటుంది.
Read More News….